Kazipet: శ్వేతార్క గణపతి ఆలయంలో కొమురవెల్లి ఒగ్గుకథ ప్రదర్శన!

Kazipet: కాజీపేట శ్వేతార్క గణపతి ఆలయంలో ఘనంగా 4వ రోజు నవరాత్రోత్సవాలు. భక్తులను అలరించిన కొమురవెల్లి ఒగ్గుకథ, స్వామివారికి శోభాయమానంగా చందనాభిషేకం.

Narender, Staff Reporter  -Warangal
Published on: 12 Sept 2026 4:38 PM IST
Kazipet
X

Kazipet: శ్వేతార్క గణపతి ఆలయంలో కొమురవెల్లి ఒగ్గుకథ ప్రదర్శన!

Kazipet: కాజీపేటలోని స్వయంభు శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయంలో జరుగుతున్న 16 రోజుల శ్రీ శ్వేతార్క గణపతి నవరాత్రోత్సవ–కళ్యాణోత్సవాల్లో భాగంగా 4వ రోజు కార్యక్రమాలు శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కొమురవెల్లి ఆస్థాన ఒగ్గుకథ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి దేవస్థానం ఒగ్గు పూజారులు సింగారపు రాజకుమార్, జక్కుల రాజమల్లు, బల్కం సూర్య, భూమయ్య, కుంటి నరసయ్య తదితర ఒగ్గు కళాకారులు సంప్రదాయ పద్ధతిలో పెద్ద పట్నం వేసి “గణపతి జననం” ఒగ్గుకథను గానం, నృత్యం, డోలు నాదంతో భక్తులకు వినిపించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ కళాకారులు ప్రదర్శించిన ఒగ్గుకథ భక్తులను ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా ఒగ్గు కళాకారులు మాట్లాడుతూ, గత 11 సంవత్సరాలుగా శ్వేతార్క గణపతి దేవాలయంతో తమకు ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఉందని తెలిపారు. కొమురవెల్లి ఆస్థాన ఒగ్గుకళను ప్రోత్సహించేందుకు దేవాలయ వ్యవస్థాపకులు బ్రహ్మీభూతులు అయినవోలు అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతి తమను ప్రతి సంవత్సరం ఆహ్వానించి ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు.

“ఈరోజు వారు భౌతికంగా మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. అయితే మమ్మల్ని ఆహ్వానించి మా ఒగ్గుకథను ఆదరించి విన్న ప్రతి భక్తబంధువులోనూ అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతిగారిని మేము చూసుకుంటున్నాం” అని కళాకారులు భావోద్వేగంతో పేర్కొన్నారు.

చందన అభిషేకంతో విశేష అలంకరణ

అంతకుముందు శ్రీ శ్వేతార్క గణపతి స్వామివారికి విశేష చందన అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. బ్రహ్మశ్రీ అయినవోలు రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు స్వామివారికి అలంకార పూజలు నిర్వహించారు.

బ్రహ్మశ్రీ మహేష్ శర్మ, గజవాడ అనంతాచార్యులు, శ్రీపాద శర్మ,, అయినవోలు సాయి కృష్ణ శర్మ తదితరులు అభిషేక క్రతువులో పాల్గొన్నారు. మంచి వృక్షాల నుంచి సేకరించిన సహజసిద్ధమైన చందనంతో ఈ అభిషేకం నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ఈ అభిషేకం, చందనం తిలకధారణకు సంబంధించిన ఆధ్యాత్మిక, సంప్రదాయ ప్రాధాన్యతను దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ అయినవోలు వెంకటేశ్వర్లు శర్మ వివరించారు.

ఈ కార్యక్రమంలో ఉత్సవాల ఇన్‌చార్జి తుమ్మ శ్రీనివాస్, దీక్షా స్వాముల ఇన్‌చార్జి దేవులపల్లి సదానందం, దేవాలయ మేనేజర్ లక్క రవి, పీఆర్వో మణిదీప్, కార్యదర్శి అరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ జానపద సంస్కృతి, భక్తి సంప్రదాయాలను ప్రతిబింబించే ఒగ్గుకథకు నవరాత్రోత్సవాల్లో వేదిక కల్పించడం ద్వారా ఆధ్యాత్మికతతో పాటు మన సాంస్కృతిక వారసత్వాన్ని కూడా కాపాడుతున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.