Station Ghanpur: స్టేషన్ ఘనపూర్‌ కాంగ్రెస్‌కు కంచుకోట.. కడియం శ్రీహరి!

Station Ghanpur: రఘునాథపల్లిలో కాంగ్రెస్ నూతన కమిటీల పరిచయ కార్యక్రమం. పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి.

Narender, Staff Reporter  -Warangal
Published on: 3 Sept 2026 8:28 AM IST
Station Ghanpur
X

Station Ghanpur: స్టేషన్ ఘనపూర్‌ కాంగ్రెస్‌కు కంచుకోట.. కడియం శ్రీహరి!

Station Ghanpur: రఘునాథపల్లి మండల కేంద్రంలోని ఖిలాషాపూర్‌ రోడ్డులో గల కేఎన్‌ఎన్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన రఘునాథపల్లి మండల, గ్రామ నూతన కమిటీల పరిచయ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య గారు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఘనంగా నివాళులు అర్పించారు. రైతులు, పేద ప్రజల సంక్షేమానికి వైస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే గారు గుర్తు చేశారు.

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ....,

స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా మార్చేందుకు నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యురాలు డా. కడియం కావ్య పిలుపునిచ్చారు. రాబోయే ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రెపరెపలాడేలా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌ను తన సొంత ఇంటిగా భావిస్తున్నానని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు తనను కుటుంబ సభ్యురాలిగా ఆదరిస్తున్నారని, వారి ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరువలేనన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ అభివృద్ధికి తన ఎంపీ ల్యాడ్స్‌ నుంచి ఎంపీ పదవీకాలంలో ఇప్పటివరకు రావాల్సిన సాధారణ నిధుల కంటే అధికంగా నియోజకవర్గానికి నిధులు అందించినట్లు తెలిపారు.

ప్రజలు, కార్యకర్తలు ఏ సమస్యను తన దృష్టికి తీసుకొచ్చినా పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో ముఖ్యమైన రైళ్లకు హాల్ట్‌ కల్పించాలనే ప్రజల డిమాండ్‌పై కేంద్ర రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ తెలిపారు.

ముఖ్యంగా ఇంటర్‌సిటీ, ఇతర కీలక రైళ్లకు స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిలుపుదల కల్పించేందుకు రైల్వే బోర్డుకు ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రైల్వే సౌకర్యాలను మెరుగుపరిచేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు సంబంధిత అధికారులను పదేపదే సంప్రదిస్తున్నట్లు పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో మహిళలకు రాజకీయాల్లో మరిన్ని అవకాశాలు లభించనున్నాయని, మహిళా రిజర్వేషన్‌ నేపథ్యంలో గ్రామస్థాయి నుంచే మహిళలు నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు రావాలని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పిలుపునిచ్చారు.

పార్టీ నిర్మాణంలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గత పదేళ్ల పాలనలో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎదుర్కొన్న పరిస్థితులను, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని ఎంపీ డా. కడియం కావ్య అన్నారు.

కాంగ్రెస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

రాబోయే రోజుల్లో వరంగల్‌ ప్రాంత అభివృద్ధికి అనేక కీలక ప్రాజెక్టులు రానున్నాయని ఎంపీ తెలిపారు. మామునూరు విమానాశ్రయం 2028లో అందుబాటులోకి వచ్చే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని, రైల్వే తయారీ యూనిట్‌, మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ వంటి ప్రాజెక్టులతో ఉమ్మడి వరంగల్‌ ప్రాంత ఆర్థిక, పారిశ్రామిక రూపురేఖలు మారనున్నాయని చెప్పారు.

నూతనంగా ఎన్నికైన మండల, గ్రామ కమిటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలకు, చిన్నచిన్న తగాదాలకు, గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండాలని ఎంపీ డా. కడియం కావ్య సూచించారు.పదవులు రాలేదని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే ప్రతి కార్యకర్తకు భవిష్యత్‌లో అవకాశాలు వస్తాయని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి చేరవేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగేందుకు పార్టీ శ్రేణులంతా కష్టపడాలని కోరారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ....

మనందరి ఏకైక ఎజెండా అభివృద్ధి, సంక్షేమ ఫలాలను పేద ప్రజలకు చేర్చడం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మనతో కలిసి రావడానికి ఇష్టంగా ఉన్న ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి ఆహ్వానించాలని తెలిపారు.

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ప్రజల మధ్యలో ఉంటూ పార్టీ కోసం పని చేసే వారికే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా మనందరం కలిసి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు.

ఏ కార్యకర్తకు ఏ అవసరం ఉన్నా నేరుగా నన్ను కలువవచ్చని, మీ పనిలో న్యాయం ఉంటే తప్పకుండా చేసేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తానని వెల్లడించారు. నియోజకవర్గంలో ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి, రేవంత్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కావాలని అందుకు ప్రతీ కార్యకర్త కట్టుబడి పనిచేయాలని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఓర్వలేక పోతున్నాయని ఆరోపించారు. బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసే దాడిని గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు. 10ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో అక్రమంగా సంపాదించిన సొమ్ము పంపకాలలో వచ్చిన గొడవ వల్లే తండ్రి కొడుకులు కవితను వెళ్లగొట్టారని విమర్శించారు.

బిఆర్ఎస్ పై కవిత చేసే ఆరోపణలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు ఏమాత్రం సిగ్గు ఉన్నా, తెలంగాణ పౌరుషం ఉన్నా వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బీజేపీ వ్యతిరేకించిందని తెలంగాణ అభివృద్ధి చెందడం ప్రధాని మోడీకి ఇష్టం లేదని అందుకే తెలంగాణపై సవతి ప్రేమ చూపెడుతూ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

పక్క రాష్ట్రాలకు వేల కోట్ల నిధులు ఇస్తుంటే తెలంగాణ నుండి ఇద్దరు మంత్రులు, 8మంది ఎంపీలు ఉండి ఎం చేస్తున్నారని ప్రశ్నించారు. 12ఏళ్లలో తెలంగాణకు ఇచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కులతత్వ, మతతత్వ రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీకి తెలుసని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరా, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జగదీష్ రెడ్డి, సీనియర్ నాయకులు లింగాజీ, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు క్రాంతి, మండల పార్టీ అధ్యక్షులు మహేందర్, కోళ్ల రవి, నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు, సర్పంచులు, నూతనంగా ఎన్నికైన గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల సమన్వయ కమిటీ సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story