Station Ghanpur: కేసీఆర్ కుటుంబ ఆస్తులపై శ్వేతపత్రం ఇవ్వాలి: కడియం శ్రీహరి!

Station Ghanpur: కల్వకుంట్ల కుటుంబం ఆస్తులపై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్. రఘునాథపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ.

MD AHMAD PASHA, JANGAON
Published on: 19 Sept 2026 9:47 PM IST
Station Ghanpur
X

Station Ghanpur: కేసీఆర్ కుటుంబ ఆస్తులపై శ్వేతపత్రం ఇవ్వాలి: కడియం శ్రీహరి!

Station Ghanpur: కేసీఆర్ కుటుంబానికి 2014లో ఉన్న ఆస్తులు ఎన్ని 2024లో ఉన్న ఆస్తులు ఎన్నో తెలంగాణ ప్రజలకు చెప్పాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు డిమాండ్ చేశారు.

రఘునాథపల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అంతకు ముందు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి-షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణి చేశారు. ఈ సందర్బంగా రఘునాథపల్లి మండలానికి సంబందించిన 24మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 24లక్షల 02వేల 784రూపాయల విలువగల చెక్కులను మరియు 35మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 18లక్షల 25వేల 500రూపాయల విలువగల చెక్కులను పంపిణి చేశారు.

అనంతరం రఘునాథపల్లి మండల కేంద్రంలో 33లక్షలతో నిర్మించనున్న ఆహార దినుసుల గోదాం నిర్మాణానికి, 10లక్షలతో నిర్మించనున్న ఎస్సి కమ్యూనిటీ హల్ నిర్మాణానికి 10లక్షలతో నిర్మించనున్న కుర్మ కమ్యూనిటీ హల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే 10లక్షలతో నిర్మించిన వివో భవనం 10లక్షలతో నిర్మించిన సిసి రోడ్లతో పాటు గ్రామంలో నూతనంగా నిర్మించిన పలు ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ. తెలంగాణ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కల్వకుంట్ల కుటుంబం 10ఏళ్లలో అధికారాన్ని అడ్డంపెట్టుకొని వందల ఎకరాల భూమిని ఆక్రమించుకురాని ఆరోపించారు. బిఆర్ఎస్ నాయకులు ధరణిని అడ్డంపెట్టుకొని ఏ రకంగా పేదల భూములను ఆక్రమించుకున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా వివరాలతో సహా వెల్లడించారాని తెలిపారు.

కేసీఆర్ కుటుంబానికి 2014ఎన్నికల అఫిడవిట్ లో ఒక్క ఎకరం లేదని చెప్పి 2024 వచ్చే సరికి వందల ఎకరాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ ఆస్తులన్నీ కూడా అధికారాన్ని అడ్డంపెట్టుకొని అక్రమంగా సంపాదించినవే అని ఆరోపించారు. 2014కు ముందు మీ ఆస్తులు ఎన్ని ఇప్పుడు మీ ఆస్తులు ఎన్నో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా మీరు నీతిమంతులే అయితే 2014 లో ఉన్న ఆస్తులు ఎన్ని 2024లో ఉన్న ఆస్తులు ఎన్ని.ఆ ఆస్తులు ఎలా వచ్చేయో తెలంగాణ ప్రజలకు చెప్పి నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మునుపేన్నడూ లేని విధంగా 1600కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతుంటే కొంతమంది కళ్ళకు కనిపించడం లేదని విమర్శించారు. 15ఏళ్ళు ఎమ్మెల్యే గా ఉన్న వ్యక్తి ఎం చేశాడో ప్రజలు ఆలోచించాలని తెలిపారు. చిల్లర పనులు, చిలిపి చేష్టలతో, అవినీతి, అక్రమాలతో నియోజకవర్గ పరువు తీశాడని ఆరోపించారు.

100పడకల ఆసుపత్రి, యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఇంటిగ్రెటెడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్, కాలువలకు మారమ్మత్తులు చేసి ప్రతీ గ్రామానికి చేరుతున్న గోదావరి జలాలతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు, సిసి రోడ్లు, వివో భవనాలు, కమ్యూనిటీ హల్లు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు.

నియోజకవర్గంలోని అర్హులైన ప్రతీ ఒక్క పేద కుటుంబానికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించడమే ఏకైక సంకల్పంగా పని చేస్తున్నాని వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని అలా ఎవరైనా అడిగితే నా దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఎల్ నీనో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో వానాకాలం పంటలకు సరిపడే నీళ్లు ఉన్నాయని రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. 20ఏళ్ల క్రితం చిన్న మొక్కగా నాటిన దేవాదుల ప్రాజెక్ట్ నేడు మహా వృక్షంగా ఎదిగి ఉమ్మడి జిల్లాకు సాగు, త్రాగు నీరు అందించే వరప్రదాయినిగా ఎదిగిందని కొనియాడారు. వారం రోజులలో కాలువల ద్వారా సాగు నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

రఘునాథపల్లి గ్రామంలో నేను ఎమ్మెల్యే గా ఎన్నికైన ఈ 3ఏళ్లలో 3కోట్ల 50లక్షల అభివృద్ధి పనులకు మంజూరు ఇచ్చానని తెలిపారు. రఘునాథపల్లి గ్రామానికి 50ఇందిరమ్మ ఇండ్లతో పాటు సిసి రోడ్లు, కమ్యూనిటీ హళ్ల నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు.

మండలంలో మంజూరు అయిన ఆర్అండ్ బీ, పంచాయతీ రాజ్ హ్యామ్ రోడ్లను 9నెలలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానని అన్నారు. ప్రస్తుత కరువు పరిస్థితులలో కూడా దేవాదుల ద్వారా సాగు నీరు అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జిల్లా మరియు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజల పక్షాన, రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గాదె మహేందర్ రెడ్డి, తహసీల్దార్, ఎంపిడివో, వివిధ శాఖల అధికారులు, జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON