Warangal: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అమలులో పొరపాట్లకు తావివ్వొద్దు

Warangal: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా అందేలా చూడాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 17 Nov 2026 10:53 PM IST
Warangal
X

Warangal: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అమలులో పొరపాట్లకు తావివ్వొద్దు

వరంగల్: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా ప్రయోజనం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.

మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత జిల్లా అధికారులతో పాటు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్.. పథకం అమలు, దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియ, ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కవరేజీ కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కుటుంబంలో 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన సభ్యుల్లో ఒకరికి మాత్రమే బీమా వర్తిస్తుందని స్పష్టం చేశారు.

*కుటుంబ వివరాల నమోదు పక్కాగా ఉండాలి

రేషన్ కార్డులు కలిగిన కుటుంబాల వివరాలు ఇప్పటికే అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా ప్రీ-ఫిల్డ్ ఫారమ్‌ల రూపంలో ఉంటాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన వివరాలను పూర్తిచేయాలని సూచించారు. ఆన్‌లైన్‌లో నమోదు అనంతరం ప్రింట్ అవుట్ తీసుకొని లబ్ధిదారుల సంతకాలు సేకరించి హార్డ్ కాపీలను భద్రపరచాలని ఆదేశించారు.

రేషన్ కార్డులు లేని కుటుంబాల వివరాలను ప్రత్యేక ఫారమ్‌ల ద్వారా సేకరించి, అర్హతలను పరిశీలించిన అనంతరం ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.

*ఆధార్ ధ్రువీకరణలో అప్రమత్తంగా ఉండాలి

దరఖాస్తుల నమోదుకు ఆధార్ ఆధారిత ఓటీపీతో పాటు బయోమెట్రిక్ ధ్రువీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ప్రతి క్యాంపులో బయోమెట్రిక్ పరికరాలు, కంప్యూటర్లు, ప్రింటర్లు అందుబాటులో ఉంచడంతో పాటు ముందుగానే వాటి పనితీరును పరిశీలించాలని ఆదేశించారు. ఆధార్ కార్డు ప్రతిపై సంబంధిత లబ్ధిదారుడి సంతకం తీసుకోవాలని స్పష్టం చేశారు.

*నామినీ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి

జీవిత బీమా పథకంలో నామినీ వివరాలు అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. లబ్ధిదారులు ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని నామినీలుగా ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా పేర్కొన్నప్పుడు వారికి కేటాయించే వాటాల మొత్తం 100 శాతం ఉండేలా చూడాలని సూచించారు. మైనర్లను నామినీలుగా పేర్కొన్న సందర్భంలో నిబంధనల ప్రకారం గార్డియన్ వివరాలను కూడా నమోదు చేయాలని ఆదేశించారు.

*ప్రత్యేక కౌంటర్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ

ప్రజలు తమ నివాస ప్రాంతానికి కేటాయించిన ప్రత్యేక కౌంటర్లలోనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఒకే కుటుంబం నుంచి వేర్వేరు ప్రాంతాల్లో దరఖాస్తులు నమోదుకాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధిక జనాభా ఉన్న గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన మేరకు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయాలని తెలిపారు.

ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

*ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

ప్రత్యేక కౌంటర్లకు వచ్చే ప్రజలకు తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. దరఖాస్తుల నమోదు ప్రక్రియపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించి, వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నమోదు చేసేందుకు ప్రత్యేక రిజిస్టర్లు ఏర్పాటు చేయాలని, గ్రామపంచాయతీ, మండల, రెవెన్యూ డివిజన్, జిల్లా స్థాయిల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

జీడబ్ల్యూఎంసీతో పాటు నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్లు, వివిధ మండలాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ అర్హులైన లబ్ధిదారులందరికీ పథకం ప్రయోజనం అందేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో పాటిస్తూ, పారదర్శకంగా, బాధ్యతాయుతంగా దరఖాస్తుల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్,మున్సిపల్ కమిషనర్ వెంకన్న,డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, డియార్వో విజయలక్ష్మి,వరంగల్ ఆర్డీవో సుమ, నర్సంపేట ఆర్డీవో ఉమారాణి,సి పి ఓ చంద్రకళ,డిపివో కల్పన, డి సి ఎస్ వో కిష్టయ్య,డి యం సివిల్ సప్లై సంధ్యారాణి, కలెక్టరేట్ సూపరిండెంట్ రంజిత్ వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపిడివోలు, తదితరులు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST