Jangaon: నాటి వీరనారుల పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం: మల్లు లక్ష్మి

Jangaon: తెలంగాణ సాయుధ పోరాట వీరనారుల స్ఫూర్తితో మహిళా సమస్యలపై ఉద్యమిస్తామని జనగామలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి స్పష్టం చేశారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 15 Sept 2026 7:32 PM IST
Jangaon
X

Jangaon: నాటి వీరనారుల పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం: మల్లు లక్ష్మి

జనగామ జిల్లా: జనగామ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మహిళలు చూపిన వీరోచిత పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని ఐద్వా మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. భూస్వామ్య, దొరల దోపిడీకి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ పోరాటంలో మహిళలు పురుషులతో సమానంగా పాల్గొని అణచివేతకు ఎదురు నిలిచారని తెలిపారు.

మంగళవారం జనగామ ఆర్టీసీ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఐద్వా జనగామ పట్టణ కార్యదర్శి పందిళ్ళ కళ్యాణి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ మల్లు లక్ష్మి . తెలంగాణ రైతాంగ పోరాటంలో మహిళలను చైతన్యపరిచి, పోరాట పంథాలో ముందుకు నడిపించిన చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యం వంటి వీరనారుల త్యాగాలు మరువలేనివని అన్నారు.

నాటి పోరాట స్ఫూర్తితో నేడు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల మహిళలపై ఆర్థిక భారం పెరుగుతోందని, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతోందని విమర్శించారు. మహిళలపై హింస, వివక్ష, దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు.

మహిళలకు సమాన హక్కులు, ఉపాధి, విద్య, వైద్యం, భద్రత కల్పించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఐద్వా ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలను నిర్మిస్తామని తెలిపారు. తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రను, మహిళల వీరోచిత పాత్రను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి ఐద్వా మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి సహాయ కార్యదర్శి ఆశలత మూడో వార్డు సిపిఎం కౌన్సిలర్ బూడిద జ్యోతి జిల్లా కమిటీ సభ్యులు మోకు భవాని ఎర్ర అనిత పల్లెల లలిత జనగామ పట్టణ అధ్యక్షులు బండ రమాదేవి బిట్ల లక్ష్మి ఎర్రోజు పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON