Warangal: పేరు మార్చి, జీతం కత్తిరిస్తే ఎలా?: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఫైర్!
Warangal: వివిధ శాఖల్లో హోదాలు మార్చి జీతాలు తగ్గించడాన్ని నిరసిస్తూ హనుమకొండలో తెలంగాణ ఔట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్లు రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు.
Warangal: పేరు మార్చి, జీతం కత్తిరిస్తే ఎలా?: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఫైర్!
Warangal: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్లు ఆదివారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. వేతనాల్లో కోతలు, హోదాల మార్పులు, ఉద్యోగ భద్రత తదితర సమస్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
రూ.500 నుంచి రూ.14,000 వరకు వేతనాలు తగ్గుతున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఒకే విధమైన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల హోదా పేరు మార్చి వేతనం తగ్గించడం ఎంతవరకు న్యాయమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పని మాత్రం పాతదే, బాధ్యతలు పాతవే, అనుభవం పాతదే, పేరు మార్చగానే జీతం ఎందుకు తగ్గాలి? అంటూ సమావేశంలో పాల్గొన్న కంప్యూటర్ ఆపరేటర్లు ప్రశ్నించారు.
కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు మున్సిపల్, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, విద్య, పంచాయతీరాజ్, నీటి సరఫరా తదితర అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్య ఉద్యమాన్ని నిర్మించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇది కేవలం కంప్యూటర్ ఆపరేటర్ల సమస్య కాదు, అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్య. నేడు ఒకరి హోదా మారితే, రేపు మరొకరి వేతనం తగ్గవచ్చు. అందుకే అన్ని శాఖల ఉద్యోగులు కలిసి పోరాడాలి అని సమావేశంలో ఉద్యోగులు పేర్కొన్నారు.
ముందుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను సంప్రదించి వారి సమస్యలను సేకరించాలని, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు అందించాలని నిర్ణయించారు. సమస్య పరిష్కారం కాకపోతే శాంతియుత, ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టేలా కార్యాచరణ రూపొందించారు. ప్రస్తుతం ఉద్యోగులు పొందుతున్న వేతనం కంటే ఒక్క రూపాయి కూడా తగ్గకుండా వేతన రక్షణ కల్పించాలని, హోదాలు, డిజిగ్నేషన్లు, వేతనాలను ప్రభుత్వం సమగ్రంగా సమీక్షించాలని డిమాండ్ చేశారు.
ఒక్కొక్కరిగా పోరాడితే మన గొంతు చిన్నదే, అన్ని శాఖల ఉద్యోగులు ఏకమైతే మన సమస్య రాష్ట్రం మొత్తం వినాల్సిందే అని సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులు స్పష్టం చేశారు. పని చేయించుకోవడానికి ఉద్యోగి కావాలి, వేతనం రక్షించడానికి ఎందుకు గుర్తుండడు? అని ప్రశ్నించారు.




