Warangal: తెలంగాణ రెడ్‌క్రాస్ సేవలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

Warangal: తెలంగాణలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను విస్తృతం చేసి ఆదర్శంగా నిలుపుతామని సభ్యుల ప్రకటన; యువత భాగస్వామ్యం, ఆరోగ్య సేవలపై కార్యాచరణ.

MD. AMEER, WARANGAL EAST
Published on: 20 Nov 2026 11:17 PM IST
Warangal
X

Warangal: తెలంగాణ రెడ్‌క్రాస్ సేవలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తృతం చేసి, దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్ర శాఖగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు ఇ.వి. శ్రీనివాస్ రావు, ఎం. రమేష్, కె. ప్రసాద్ రావు పేర్కొన్నారు.

రెడ్‌క్రాస్ సంస్థ కేవలం రక్తదాన కార్యక్రమాలకే పరిమితం కాకుండా, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, ఆరోగ్య సేవలు, తలసేమియా బాధితులకు అండగా నిలవడం, యువతలో సేవాభావాన్ని పెంపొందించడం, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు వంటి అనేక రంగాల్లో మరింత చురుకైన పాత్ర పోషించేలా సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతామని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జిల్లా పాలక మండళ్ల సహకారంతో రెడ్‌క్రాస్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తూ, జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, యువజన సంఘాల సమన్వయంతో సేవా కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని వెల్లడించారు.

ముఖ్యంగా యువత, విద్యార్థులు, సామాజిక సేవకులను పెద్ద సంఖ్యలో రెడ్‌క్రాస్ సేవల్లో భాగస్వాములను చేయడం ద్వారా నషా ముక్త్ భారత్, టీబీ ముక్త్ భారత్ కార్యక్రమాలతో పాటు రక్తదానం, ఆరోగ్య అవగాహన, విపత్తుల నిర్వహణ వంటి సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని పేర్కొన్నారు. జూనియర్ రెడ్‌క్రాస్, యూత్ రెడ్‌క్రాస్ విభాగాలను మరింత క్రియాశీలం చేసి, విద్యార్థుల్లో సేవాభావం, నాయకత్వ లక్షణాలు, మానవతా విలువలను పెంపొందించేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

రెడ్‌క్రాస్ సంస్థ పట్ల ప్రజల్లో మరింత విశ్వాసం పెంపొందించేలా పారదర్శకత, జవాబుదారీతనం, సమన్వయం, సేవా స్ఫూర్తికి ప్రాధాన్యతనిస్తూ ప్రతి జిల్లాలో పటిష్టమైన సేవా వ్యవస్థను నిర్మించడమే తమ సంకల్పమని స్పష్టం చేశారు. రక్తదాతల సంఖ్యను పెంచడంతో పాటు అవసరమైన వారికి సకాలంలో రక్తం అందించే వ్యవస్థను బలోపేతం చేయడం, ఆరోగ్య శిబిరాలు, వైద్య సేవలు, విపత్తు సహాయక కార్యక్రమాలను నిరంతరం కొనసాగించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

ప్రభుత్వ సహకారం, జిల్లా పాలక మండళ్ల భాగస్వామ్యం, ప్రజల ఆదరణతో రెడ్‌క్రాస్ సేవలను గ్రామస్థాయి వరకు విస్తరించేందుకు కృషి చేస్తామని, సమిష్టి కృషితో తెలంగాణ రాష్ట్రాన్ని మానవతా సేవల్లో దేశానికే ఆదర్శంగా నిలుపుతామని వారు ధీమా వ్యక్తం చేశారు.

“మానవతా సేవే మన ధ్యేయం – ప్రాణాలను కాపాడటమే మన లక్ష్యం” అనే రెడ్‌క్రాస్ ఆశయాన్ని ప్రతి ఒక్కరిలోకి తీసుకెళ్లి, సేవే పరమావధిగా ముందుకు సాగుతామని రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు పునరుద్ఘాటించారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST