Bhupalpally: ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేతలా?: అధికారులపై సింగరేణి జేఏసీ ఫైర్!
Bhupalpally: జయశంకర్ భూపాలపల్లిలో రోడ్డు విస్తరణ కూల్చివేతలను అడ్డుకున్న సింగరేణి కార్మిక సంఘాలు.
Bhupalpally: ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేతలా?: అధికారులపై సింగరేణి జేఏసీ ఫైర్!
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు ఉద్రిక్తతకు దారితీశాయి. పట్టణ అభివృద్ధిలో భాగంగా మున్సిపాలిటీ చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులను సింగరేణి కార్మిక సంఘాల నాయకులు అడ్డుకున్నారు. విస్తరణ పనుల్లో భాగంగా చిరు వ్యాపారుల దుకాణాలతో పాటు సింగరేణి సంస్థకు చెందిన కమిటీ హాల్, వివిధ కార్మిక సంఘాల కార్యాలయాల గోడలను తొలగించే ప్రయత్నం చేయడంపై కార్మికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
అభివృద్ధి పేరుతో ఏళ్లుగా జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సింగరేణి సంస్థకు చెందిన ఆస్తులను ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు లేకుండా కూల్చివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక సంఘాల కార్యాలయాలు, కమిటీ హాల్‌ను తొలగించే విషయంలో సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
రోడ్డు విస్తరణ పేరుతో షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపట్టి కోట్ల రూపాయల లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జేఏసీ నాయకులు ఆరోపించారు. ప్రజలకు మేలు చేసే అభివృద్ధి కార్యక్రమాల పేరుతో కార్మికుల హక్కులను, చిరు వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీయడాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ పాలకవర్గం తీరుపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. అవసరమైతే మరుసటి రోజు సింగరేణి పరిధిలోని అన్ని గనుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని పిలుపునిచ్చారు.




