Guduru: గూడూరు అటవీ శాఖ కార్యాలయంలో దొంగతనం.. వేట సామాగ్రి గాయబ్!
Guduru: మహబూబాబాద్ జిల్లా గూడూరు అటవీ శాఖ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న వేట సామాగ్రి దొంగతనం కావడం కలకలం రేపింది.
Guduru: గూడూరు అటవీ శాఖ కార్యాలయంలో దొంగతనం.. వేట సామాగ్రి గాయబ్!
Guduru: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని అటవీ శాఖ కార్యాలయంలో చోరీ జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అటవీ ప్రాంతంలో జంతువుల వేటను అరికట్టేందుకు అధికారులు స్వాధీనం చేసుకున్న కీలకమైన వేట పరికరాలు దొంగతనానికి గురికావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.
గూడూరు మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఇటీవల వన్యప్రాణుల వేట విపరీతంగా జరుగుతోంది. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు వేటగాళ్ల నుంచి జంతువులకు వేసే ఉచ్చులు, వేటకు ఉపయోగించే వివిధ రకాల సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ స్వాధీనం చేసుకున్న సామాగ్రిని గూడూరు మండల కేంద్రంలో ఉన్న ప్రధాన అటవీ శాఖ కార్యాలయంలో భద్రపరచాల్సి ఉండగా, అధికారులు మాత్రం ‘భీముని పాదం’ వద్ద ఉన్న ఒక గదిలో భద్రపరిచారు.
కాగా, గుర్తుతెలియని వ్యక్తులు ఆ గది కిటికీ తలుపులు, వేసిన తాళాలను పగలగొట్టి లోపల ఉన్న వేట సామాగ్రితో పాటు ఇతర వస్తువులను దొంగిలించారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానిక అటవీ శాఖ సెక్షన్ మరియు బీట్ అధికారులు గూడూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అటవీ అధికారుల పాత్రపై జోరుగా ప్రచారం
స్వాధీనం చేసుకున్న వేట సామాగ్రిని ప్రధాన కార్యాలయంలో భద్రపరచకుండా, భీముని పాదం వద్ద ఉన్న గదిలో ఎందుకు ఉంచారనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చోరీ వెనుక అటవీ శాఖలో పనిచేస్తున్న కొంతమంది అధికారుల హస్తం కూడా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. వేటగాళ్లతో కొందరు అధికారులు చేతులు కలిపి ఈ నాటకానికి తెరతీశారా అనే కోణంలో స్థానికులు చర్చించుకుంటున్నారు.
పిర్యదు చేసిన విషయం నిజమే -ఎస్సై రమేష్ బాబు
అటవీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు గూడూరు ఎస్సై రమేష్ బాబు తెలిపారు. ఈ ఘటనపై త్వరలోనే పూర్తిస్థాయి విచారణ జరిపి, దొంగతనానికి పాల్పడిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన వెల్లడించారు.
స్థానిక నాయకుల అండదండల ఉన్నయంటా..??.
వేటకు ఉపయోగించే సామాగ్రిని దొంగలించిన వ్యక్తులను స్థానిక నాయకులు రక్షిస్తున్నారని విషయం జోరుగా ప్రచారం సాగుతుంది. నాయకుల అండతండాలతో ఈ కేసును పక్కదోవ పట్టించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దొంగలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి
గూడూరు మండలంలో జంతువుల వేటలను తగ్గించి ఆ వేటకు ఉపయోగించే సామాగ్రిని దొంగలించిన వ్యక్తులను వెంటనే గుర్తించి వారిని కఠిన చర్యలు తీసుకోవాలని వన్యప్రాణి ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. గూడూరు మండలంలో జంతువుల వేట జరగకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.




