Warangal: భవిత కేంద్రాలతో భవిష్యత్ మార్చుకోవాలి: కలెక్టర్
Warangal: ప్రత్యేక అవసరాలు గల పిల్లలు భవిత కేంద్రాల ద్వారా ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలు సాధించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు.
Warangal: భవిత కేంద్రాలతో భవిష్యత్ మార్చుకోవాలి: కలెక్టర్
వరంగల్: ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఉన్నత లక్ష్యాలను సాధించేలా భవిత కేంద్రాల ద్వారా నాణ్యమైన విద్య, ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. దివ్యాంగ విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
సమ్మిళిత విద్యపై ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులు, సంబంధిత వ్యక్తులకు వరంగల్లోని ఆకుతోట కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి అవగాహన, శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల అవసరాలను తల్లిదండ్రులు అర్థం చేసుకుని, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు చొరవ చూపాలన్నారు. సమ్మిళిత విద్యలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని, పాఠశాల ప్రత్యేక ఉపాధ్యాయులు, ఐఈఆర్పీలు, ఇతర నిపుణులతో సమన్వయం చేసుకుంటూ పిల్లల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
స్టీఫెన్ హాకింగ్, ఐజాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ వంటి ప్రముఖులు ఎన్నో సవాళ్లను అధిగమించి ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందారని గుర్తుచేశారు.
అంతర్జాతీయ క్రీడా వేదికపై పతకాలు సాధించిన దివ్యాంగ క్రీడాకారిణి దీప్తి జీవాంజిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
దివ్యాంగ హక్కుల చట్టం-2016 ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక జీవనం, ప్రజా సేవల్లో సమాన హక్కులు ఉన్నాయని తెలిపారు. దివ్యాంగుల పట్ల ఉన్న అపోహలు, వివక్షను తొలగించి, సమాజంలోని అన్ని కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేయాలని కోరారు.
జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సమ్మిళిత విద్య ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సాధారణ విద్యార్థులతో సమానంగా విద్యను అభ్యసించే అవకాశాలు కల్పించవచ్చన్నారు. ప్రశస్త్ యాప్ ద్వారా ప్రతి పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రారంభ దశలోనే గుర్తించి స్క్రీనింగ్ చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల వినికిడి, దృష్టి, శారీరక, మేధో, అభ్యాస, భాషా తదితర అంశాలకు సంబంధించి 21 రకాల వైకల్యాలను ప్రాథమికంగా గుర్తించి, అవసరమైన వారికి తగిన వైద్య, విద్యా సహాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కార్యక్రమ సమన్వయకర్త, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ కట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో 18 మంది ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులు, 17 మంది ఐఈఆర్పీలు, ముగ్గురు ఫిజియోథెరపిస్టులు సేవలందిస్తున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థి సామర్థ్యం, అవసరాలను బట్టి వ్యక్తిగత విద్యా ప్రణాళిక రూపొందించి చదవడం, రాయడం, అక్షరాలు, సంఖ్యలు, ప్రాథమిక గణిత నైపుణ్యాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామన్నారు.
సోమవారం నుంచి శుక్రవారం వరకు భవిత కేంద్రాల్లో ప్రత్యేక విద్యా శిక్షణ అందిస్తామని, తీవ్రమైన లేదా బహుళ వైకల్యాల కారణంగా పాఠశాలకు హాజరుకాలేని పిల్లలకు ఇంటి వద్దనే విద్య, అభివృద్ధికి సంబంధించిన శిక్షణ అందించేలా ప్రత్యేక ఉపాధ్యాయులు మార్గదర్శనం చేస్తారని వివరించారు.
విద్యార్థులకు అవసరమైన వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, వాకింగ్ ఎయిడ్స్, వినికిడి పరికరాలు తదితర సహాయక పరికరాలను గుర్తించి అందించేందుకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లాలోని ప్రతి మండలంలో వారానికి రెండుసార్లు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఫిజియోథెరపీ సేవలు అందించేందుకు శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. పిల్లల శారీరక సామర్థ్యం, కదలికలు, మోటార్ నైపుణ్యాల అభివృద్ధికి అవసరమైన వ్యాయామాలు, శిక్షణతో పాటు తల్లిదండ్రులకు ఇంటి వద్ద చేయాల్సిన వ్యాయామాలపై సూచనలు అందిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ సంతోష్ ప్రదర్శించిన నృత్యం ఆకట్టుకోగా, దివ్య బృందం పాటలు ఆలపించింది. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ బరుపాటి గోపి దివ్యాంగులకు సంబంధించిన వివిధ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజారెడ్డి, విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ మహేష్ నాయక్, డీసీసీబీ సెక్రటరీ కృష్ణమూర్తి, ప్లానింగ్ కోఆర్డినేటర్ విజయ్ కుమార్, ఏఎస్ఓ వేణుగోపాల్, జిల్లా సైన్స్ అధికారి సురేష్ బాబు, శ్రవణ్ కుమార్, కన్వీనర్లు బి. నరసింహారావు, వి. రామకృష్ణారెడ్డి, బి. ప్రసాద్, కో-కన్వీనర్లు కృష్ణారెడ్డి, పిన్నింటి బాలాజీరావు, అనుపమ, పరమేశ్వర్, రిసోర్స్ పర్సన్లు అనిల్ కృపాకర్, నరసింహస్వామి, శ్రీనివాస్, ప్రియాంక, మహేందర్, వరలక్ష్మి, వివిధ మండలాల ఎంఈఓలు, విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.




