Warangal: టీఆర్‌టీ కాలనీలో మురుగునీటి కష్టాలు.. ప్రధాన రహదారిపై మురుగు ప్రవాహం!

Warangal: వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై మురుగునీరు నిల్వ ఉండి టీఆర్‌టీ కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 15 Nov 2026 8:40 AM IST
Warangal
X

Warangal: టీఆర్‌టీ కాలనీలో మురుగునీటి కష్టాలు.. ప్రధాన రహదారిపై మురుగు ప్రవాహం!

Warangal: వరంగల్ నగరంలోని 18వ డివిజన్ లేబర్ కాలనీ పరిధిలోని టీఆర్‌టీ కాలనీవాసులు మురుగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై మురుగునీరు ప్రవహిస్తూ నిల్వ ఉండటంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సరైన మురుగునీటి కాలువలు లేకపోవడంతో ఇళ్ల నుంచి వెలువడే మురుగునీరు రోడ్డుపైకి చేరుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డుపై రోజుల తరబడి మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

పాదచారులు, ద్విచక్ర వాహనదారులు మురుగునీటిని దాటుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపలేదని ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపి, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి శాశ్వత మురుగునీటి కాలువ నిర్మించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST