Warangal: మిషన్ ఎయిడ్స్ సురక్ష విజయవంతం చేయాలి.. వరంగల్ కలెక్టర్
Warangal: వరంగల్ జిల్లాలో "మిషన్ ఎయిడ్స్ సురక్ష" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.
Warangal: మిషన్ ఎయిడ్స్ సురక్ష విజయవంతం చేయాలి.. వరంగల్ కలెక్టర్
Warangal: జాతీయ లక్ష్యమైన 95-95-95 సాధన దిశగా "మిషన్ ఎయిడ్స్ సురక్ష" కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద నిర్వహించిన సమీక్ష సమావేశంలో జాతీయ లక్ష్యమైన 95-95-95 సాధనపై విస్తృతంగా చర్చించారు.
తొలి "95" లక్ష్యంలో మార్చి నెలలో నమోదైన 23 శాతం నుంచి ప్రస్తుతం 68 శాతానికి పురోగతి సాధించినప్పటికీ, ఇంకా లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉన్నందున రానున్న మూడు నెలల్లో అన్ని శాఖల సమన్వయంతో 95 శాతం లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించే దిశగా కృషి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా హెచ్‌ఐవీతో జీవిస్తున్న ప్రతి రోగి క్రమం తప్పకుండా మందులు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, అర్హులైన వారందరికీ వైరల్ లోడ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. చికిత్సను మధ్యలో నిలిపివేయకుండా నిరంతరం పర్యవేక్షించడం ద్వారా వైరల్ లోడ్ తగ్గి రోగులు ఆరోగ్యంగా జీవించే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు.
మూడో "95" లక్ష్యంలో ఉన్న 1.5 శాతం అంతరాన్ని త్వరగా అధిగమిస్తే రాష్ట్రంలోనే ఉత్తమ కేంద్రంగా నిలిచే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHCs) వైద్యాధికారులు, సంబంధిత అధికారులతో త్వరలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి 95-95-95 లక్ష్య సాధనకు కార్యాచరణ రూపొందిస్తామని కలెక్టర్ తెలిపారు
ఈ కార్యక్రమంలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) తెలంగాణ రాష్ట్ర నోడల్ అధికారి సమ్రేష్, రాష్ట్ర బేసిక్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ డా. జయలక్ష్మి, టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ (TI) జాయింట్ డైరెక్టర్ ప్రసాద్, రాష్ట్ర సమన్వయకర్త కామేశ్వరరావు, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ డా. ప్రకాష్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. అరుణ్‌కుమార్ జోషి, డీపీఎం స్వప్న మాధురి, డీఐఎస్ రామకృష్ణ, సహయోగి మంజులతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




