Warangal: ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ సత్యశారద
Warangal: వరంగల్‌లో ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ సత్యశారద. ముఖ్య అతిథిగా తెలంగాణ బోర్డు వైస్‌చైర్మన్ విజయలక్ష్మి హాజరు.
Warangal: ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ సత్యశారద
వరంగల్: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న ఖిలా వరంగల్‌లో నిర్వహించనున్న కార్యక్రమానికి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం వరంగల్ లోని ఓ సిటీ గ్రౌండ్ లో ఏర్పాట్లను సందర్శించిన ఆమె కార్యక్రమం నిర్వహించే ప్రదేశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమానికి తెలంగాణ బోర్డు వైస్‌చైర్మన్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా వేదిక ఏర్పాటు, బారికేడింగ్, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కార్యక్రమ ప్రాంగణంలో భద్రతా చర్యలు పటిష్టంగా చేపట్టాలని, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు ప్రాంగణంలో పరిశుభ్రతను కొనసాగించాలని సూచించారు.
ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ అవసరమైన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సందర్శనలో ఆర్డీవో వరంగల్ సుమ,వరంగల్ తహసిల్దార్ శ్రీకాంత్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.




