Warangal: నరకాసుర వధ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు
Warangal: నవంబర్ 6న వరంగల్ ఉర్సు రంగలీల మైదానంలో జరగనున్న నరకాసుర వధ కార్యక్రమ ఏర్పాట్లపై కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Warangal: నరకాసుర వధ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు
వరంగల్: దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 6, 2026న వరంగల్‌లోని ఉర్సు రంగలీల మైదానంలో నిర్వహించనున్న నరకాసుర వధ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టరేట్‌లో నరకాసుర వధ కార్యక్రమ నిర్వహణపై వివిధ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు, వివిధ శాఖల మధ్య సమన్వయం, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రతా చర్యలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు తగిన సౌకర్యాలు కల్పించడంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అగ్నిప్రమాదాలు, ఇతర అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
వివిధ శాఖల అధికారులు, నరకాసుర వధ ఉత్సవ కమిటీ సభ్యులు పరస్పర సమన్వయంతో పనిచేసి, కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పేర్కొన్నారు.
ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) వై.వి. గణేష్, డీఆర్వో విజయలక్ష్మి, వరంగల్ ఆర్డీవో సుమ, ఆర్‌అండ్‌బీ ఈఈ రాజేందర్, డీఎంహెచ్‌వో రాజిరెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, నరకాసుర వధ ఉత్సవ కమిటీ అధ్యక్షులు, మారుపల్లి రవి, ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల రవి, కోశాధికారి మారుపల్ల గౌతమ్, తదితరులు పాల్గొన్నారు.




