Warangal: మాదకద్రవ్యాలపై మహిళా సంఘాల అవగాహన సదస్సు 'సంఘమిత్ర'

Warangal: జనగామ జిల్లా కలెక్టరేట్‌లో వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమక్షంలో 'సంఘమిత్ర' అవగాహన సదస్సు.

Narender, Staff Reporter  -Warangal
Updated on: 26 Aug 2026 10:50 PM IST
Warangal
X

Warangal: మాదకద్రవ్యాలపై మహిళా సంఘాల అవగాహన సదస్సు 'సంఘమిత్ర'

వరంగల్: మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళా సంఘాల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి మహిళ తన కుటుంబంతో పాటు గ్రామాలను, పట్టణాలను కూడా మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడే "సంఘమిత్ర"గా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత పిలుపునిచ్చారు.

బుధవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు "సంఘమిత్ర – మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు"ను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజ మహేంద్ర నాయక్ లతో కలిసి ముఖ్య అతిథిగా వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత హాజరై, జ్యోతి ప్రజ్వలన గావించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషించాయని, గర్భిణీలకు పోషకాహారం అందించడం నుంచి చిన్నారులకు మధ్యాహ్న భోజనం, అక్షరాస్యత, కుటుంబ సంక్షేమం, సామాజిక ఆడిట్ వంటి అనేక కార్యక్రమాల్లో మహిళలు ముందుండి పనిచేస్తున్నారన్నారు.

జనగామ జిల్లాలో మహిళల చైతన్యం ప్రత్యేకమని పేర్కొంటూ, ఆ చైతన్యాన్ని సమాజ భద్రత కోసం వినియోగించాలని కోరారు. కమిషనరేట్ పరిధిలో సుమారు 26 లక్షల జనాభాకు కేవలం 3 వేల మంది పోలీసు సిబ్బంది మాత్రమే ఉన్నారని, అందువల్ల మహిళా సంఘాల సహకారం అత్యంత అవసరమని వివరించారు.

పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ వ్యసనం అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తెలంగాణలో అలాంటి పరిస్థితి రాకుండా ఇప్పుడే సమిష్టిగా చర్యలు తీసుకోవాలన్నారు. యువతే రాష్ట్ర భవిష్యత్తు అని, వారిని కాపాడటం ప్రతి కుటుంబం, ప్రతి మహిళా సంఘం బాధ్యత అని స్పష్టం చేశారు.

గంజాయి వంటి మాదకద్రవ్యాల దుష్ప్రభావం వెంటనే కనిపించకపోయినా కొంతకాలానికి మెదడు, నరాల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. డ్రగ్స్‌కు బానిసైన వారిని నేరస్తులుగా చూడడం సరికాదని, వారికి చికిత్స అందించి, తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు.

మహిళా సంఘాలు సామాజిక మార్పుకు బలమైన వేదికలుగా ఉన్నాయని, పోలీస్ శాఖలో ఉన్న పరిమిత సిబ్బందితో పోలిస్తే మహిళా సంఘాల ద్వారా లక్షలాది మందికి అవగాహన కల్పించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి మహిళా సంఘ సమావేశంలో డ్రగ్స్, సైబర్ నేరాలు, మహిళల భద్రత వంటి అంశాలపై తప్పనిసరిగా చర్చించాలని సూచించారు.

గ్రామాల్లో ఎవరైనా మాదకద్రవ్యాలకు బానిసైనట్లు తెలిసినా, గంజాయి విక్రయాలు, రవాణా (లేదా) వినియోగం జరుగుతున్నట్లు సమాచారం ఉన్నా వెంటనే 112కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడంతో పాటు అవసరమైతే బహుమతులు కూడా అందజేస్తామని వెల్లడించారు.

పాఠశాల నిర్వహణ కమిటీల్లో ఉన్న మహిళా సభ్యులు విద్యార్థుల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పదో తరగతి (లేదా) ఇతర తరగతుల విద్యార్థులు అకస్మాత్తుగా పాఠశాలకు రాకపోవడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం, అనుమానాస్పదంగా ప్రవర్తించడం వంటి అంశాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

సంఘమిత్ర కార్యక్రమం ఒకరోజు కార్యక్రమంతో ముగిసేది కాదని, ఇకపై మండల సమాఖ్యలు, జిల్లా సమాఖ్యల సమావేశాల్లో పోలీసు అధికారులు క్రమం తప్పకుండా పాల్గొని, డ్రగ్స్ నిర్మూలన, సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనకు మహిళా సంఘాలే ప్రధాన శక్తిగా నిలవాలన్నారు. జిల్లాలో సుమారు 1.25 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు ఉన్నారని, వీరి ద్వారా ప్రతి ఇంటికి డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని తీసుకెళ్లవచ్చని చెప్పారు.

డ్రగ్స్ వల్ల వ్యక్తిగత ఆరోగ్యం మాత్రమే కాకుండా కుటుంబాల్లో గృహ హింస, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామ మహిళా సంఘాలు, సంఘ సమాఖ్యలు, కాలనీ సమావేశాల్లో చర్చించి, యువతను మాదకద్రవ్యాల నుంచి దూరంగా ఉంచేందుకు కృషి చేయాలని సూచించారు.

జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

అదే విధంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ.. జనగామ జిల్లా మహిళా సంఘాలు రాష్ట్రంలోనే అత్యంత చైతన్యవంతమైన సంఘాలుగా గుర్తింపు పొందాయన్నారు.

డ్రగ్స్ మొదట సరదాగా ప్రారంభమై చివరకు ప్రాణాంతక వ్యసనంగా మారుతుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో మార్పులు, ఆలస్యంగా ఇంటికి రావడం, రాత్రిళ్లు మేల్కొని ఉండడం, కొత్త స్నేహాలు, చేతులపై ఇంజెక్షన్ గుర్తులు, పెదాలు నల్లబడటం వంటి లక్షణాలను గమనించాలని సూచించారు. సమస్యను దాచిపెట్టకుండా వెంటనే పోలీసులకు (లేదా) డీ-అడిక్షన్ కేంద్రాలకు సమాచారం ఇవ్వాలని కోరారు.

మాదకద్రవ్యాల నియంత్రణకు అమలులో ఉన్న ఎన్‌డీపీఎస్ చట్టం–1985 ప్రకారం గంజాయి సేవించడం, విక్రయించడం, రవాణా చేయడం, దాచిపెట్టడం వంటి నేరాలకు కఠిన జైలు శిక్షలు, భారీ జరిమానాలు ఉంటాయని వివరించారు. డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ సదస్సులో సైకాలజిస్ట్ డా. విజయక్రాంతి మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక దుష్ప్రభావాలు, చికిత్స, పునరావాసంపై పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.

అలాగే డ్రగ్స్ వ్యసనం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులు, పోలీస్ జాగృతి కళా బృందం సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికల రూపంలో హృద్యంగా ప్రదర్శించి సందేశాన్ని అందించారు. అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలనపై వారందరూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణ ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏసీపీలు భీం శర్మ, నర్సయ్య, ఏపీడీ నూరుద్దీన్, ఇన్స్ స్పెక్టర్లు సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వేణు, జానకీరాం రెడ్డి సతీష్, చాకలి ఐలమ్మ సమాఖ్య నాయకురాలు మమత, ఇతర పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు, సభ్యులు, మహిళలు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story