Warangal: ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా పాదయాత్ర, వైద్య శిబిరం
Warangal: వరంగల్లో ఉస్మానియా హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ మధుమేహ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భారీ పాదయాత్రతో పాటు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
Warangal: ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా పాదయాత్ర, వైద్య శిబిరం
వరంగల్: ప్రపంచ మధుమేహ దినోత్సవం (World Diabetes Day) సందర్భంగా వరంగల్లోని జేపీఎన్ రోడ్డులో ఉన్న ఉస్మానియా హాస్పిటల్ ఆధ్వర్యంలో డయాబెటిస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ అవగాహన పాదయాత్ర నిర్వహించారు.
ఉస్మానియా హాస్పిటల్ అధినేత, సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ & డయాబెటాలజిస్ట్ డా. అజిత్ మహమ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్ర ఉస్మానియా హాస్పిటల్, జేపీఎన్ రోడ్ నుండి ప్రారంభమై పోచమ్మ మైదాన్ జంక్షన్లోని రుద్రమదేవి విగ్రహం వరకు కొనసాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. పి. కాళీ ప్రసాదరావు , నేషనల్ ఐఎంఏ కన్వీనర్ మరియు తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు హాజరై పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డా. కాళీ ప్రసాదరావు మాట్లాడుతూ, మధుమేహం రోజురోజుకూ పెరుగుతున్న జీవనశైలి వ్యాధి అని, సరైన ఆహారపు అలవాట్లు, క్రమబద్ధమైన వ్యాయామం, బరువు నియంత్రణ, క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయిల పరీక్షలు చేయించుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చని తెలిపారు. మధుమేహంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐఎంఏ మాజీ అధ్యక్షులు డా. అన్వర్ మియా, ఐఎంఏ కార్యదర్శి డా. శంకేసి శిరీష్ కుమార్, డా. వెంకటస్వామి, డా. సృజన్, డా. దిలీప్ తదితర వైద్యులు, వైద్య సిబ్బంది, మెడికల్ రిప్రజెంటేటివ్స్ మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
ఈ పాదయాత్ర ద్వారా మధుమేహ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడం, వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, సరైన చికిత్స మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతను తెలియజేయడం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. “మధుమేహాన్ని భయపడకండి – అవగాహనతో ఎదుర్కోండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోండి” అనే సందేశంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
ర్యాలీ అనంతరం ఉస్మానియా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 320 మందికి ఉచితంగా రక్తంలో చక్కెర (షుగర్), రక్తపోటు (బీపీ), ఈసీజీ పరీక్షలు నిర్వహించినట్లు ఉస్మానియా హాస్పిటల్ అధినేత డా. అజిత్ మహమ్మద్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మధుమేహం మరియు అధిక రక్తపోటు వంటి వ్యాధులను ముందుగానే గుర్తించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు అందించి ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే ఈ శిబిరం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.




