Warangal: వీధి కుక్కల రక్షణ కోసం జ్వాలా సంస్థ దీక్ష.. వినూత్న విన్నపం!

Warangal: వరంగల్ జిల్లా ఆరేపల్లిలో వీధి కుక్కల రక్షణ కోసం 'జ్వాలా' సంస్థ వినూత్న మౌన నిరసన.

NARENDER, WARANGAL
Published on: 22 May 2026 5:52 PM IST
Warangal
X

Warangal: వీధి కుక్కల రక్షణ కోసం జ్వాలా సంస్థ దీక్ష.. వినూత్న విన్నపం!

Warangal: వరంగల్ జిల్లా హనుమకొండ మండలం ఆరేపల్లి గ్రామంలో జ్వాలా అవినీతి వ్యతిరేక సంస్థ ఆధ్వర్యంలో వీధి కుక్కల రక్షణ కోసం ఎవరూ విని ఎరుగని రీతిలో వినూత్న మౌన నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని జ్వాలా అవినీతి వ్యతిరేక సంస్థ నిర్వాహకులు, జంతు ప్రేమికుడు సుంకరి ప్రశాంత్ నిర్వహించి మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో ఎలాంటి నినాదాలు చేయకుండా, ప్లే కార్డులకు నల్ల బ్యాడ్జీలు ఏర్పాటు చేసి మౌనంగా నిరసన తెలిపారు. వీధి కుక్కలకు ఆహారం మరియు తాగునీరు ఏర్పాటు చేయగా, పరిసర ప్రాంతాల నుండి వచ్చిన వీధి కుక్కలు స్వయంగా వచ్చి ఏర్పాటు చేసిన ఆహారాన్ని, నీటిని స్వీకరించి వెళ్లాయి.

ప్లే కార్డుల ముందు వీధి కుక్కలు మౌనంగా ఆహారం తీసుకోవడం ద్వారా “సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించాలి… మూగజీవాలను రక్షించాలి” అనే సందేశాన్ని మూగజీవాలే తమదైన రీతిలో తెలియజేసినట్టుగా అక్కడి ప్రజలు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా సుంకరి ప్రశాంత్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A(g) ప్రకారం జంతువుల పట్ల కరుణ చూపడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. “జంతు క్రూరత్వ నిరోధక చట్టం – 1960” ప్రకారం మూగజీవాలను హింసించడం, ఆహారం మరియు నీరు నిరాకరించడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.

అలాగే వీధి కుక్కల సంరక్షణ, స్టెరిలైజేషన్ (ABC), వ్యాక్సినేషన్ మరియు సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు సక్రమంగా ఖర్చు చేయకుండా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. వీధి కుక్కల పేరుతో కేటాయించిన బడ్జెట్‌ను అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నోరు లేని వీధి కుక్కల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, హింసాత్మక చర్యలు కాకుండా శాస్త్రీయ పద్ధతిలో స్టెరిలైజేషన్, యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్, ఆహారం మరియు తాగునీటి సదుపాయాలు కల్పించాలని కోరారు.

వీధి కుక్కలకు ఆహారం పెట్టే జంతు ప్రేమికులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, వారిని వేధించడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే స్థానిక సంస్థలు జంతు సంక్షేమ కమిటీలను బలోపేతం చేసి మూగజీవాల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.

ఇటీవల వెలువడిన సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించి, మూగజీవాల ప్రాణహక్కులను రక్షించే విధంగా స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని జ్వాలా సంస్థ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, జంతు ప్రేమికులు మరియు యువత పాల్గొని మూగజీవాల రక్షణకు సంఘీభావం తెలిపారు.

NARENDER, WARANGAL

NARENDER, WARANGAL

Next Story