Warangal: కొలనుపల్లిలో నకిలీ వైద్య కేంద్రంపై టీజీఎంసీ ఆకస్మిక తనిఖీలు

Warangal: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొలనుపల్లిలో అల్లోపతి వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుడిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) దాడులు, క్రిమినల్ కేసు నమోదు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 10 Nov 2026 10:15 PM IST
Warangal
X

Warangal: కొలనుపల్లిలో నకిలీ వైద్య కేంద్రంపై టీజీఎంసీ ఆకస్మిక తనిఖీలు

వరంగల్: రాయపర్తి మండలం, కొలనుపల్లి గ్రామంలో అర్హత లేకుండా అల్లోపతి వైద్యం అందిస్తున్నారనే వచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) సభ్యులు తనిఖీలు నిర్వహించారు. ఫిర్యాదు ప్రకారం, మాచర్ల సుధాకర్ అనే వ్యక్తి ఇంటర్మీడియట్‌లో విద్యాభ్యాసం నిలిపివేసి, ఎలాంటి గుర్తింపు పొందిన వైద్య విద్యార్హత లేకుండానే అల్లోపతి వైద్యం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

అంతేకాకుండా, Clinical Establishments Act (CEA) ప్రకారం అవసరమైన అనుమతులు లేకుండా వైద్య కేంద్రాన్ని నిర్వహిస్తూ, ఆసుపత్రి తరహాలో బెడ్లు ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నట్లు తనిఖీల సందర్భంగా గుర్తించారు. రోగులకు అధిక మోతాదులో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, నొప్పి నివారణ మందులు (Pain Killers) వినియోగిస్తున్నట్లు కూడా తనిఖీల సందర్భంగా గుర్తించిన అంశాలను టీజీఎంసీ (తెలంగాణా మెడికల్ కౌన్సిల్ )తీవ్రంగా పరిగణించింది.

ఈ తనిఖీలలో TGMC సభ్యులు డాక్టర్ V. నరేష్ కుమార్ మరియు కో-ఆప్ట్ సభ్యులు డాక్టర్ K. వెంకటస్వామి పాల్గొన్నారు.

తనిఖీల సందర్భంగా సంబంధిత కేంద్రాన్ని పరిశీలించి, అక్కడ నిర్వహిస్తున్న వైద్య సేవలకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. అర్హత లేకుండా అల్లోపతి వైద్యం నిర్వహించడం, అవసరమైన అనుమతులు లేకుండా వైద్య కేంద్రాన్ని నడపడం వంటి ఉల్లంఘనలపై సేకరించిన ఆధారాల ఆధారంగా, తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్టం (TMPR Act) సెక్షన్ 22 ప్రకారం సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయడానికి TGMC చర్యలు చేపడుతోంది.

ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న నకిలీ వైద్యం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

వైద్య విద్యార్హతలు, సరైన శిక్షణ, వ్యాధి నిర్ధారణ పరిజ్ఞానం లేని వ్యక్తుల వద్ద చికిత్స తీసుకోవడం వల్ల రోగుల ప్రాణాలకు తీవ్రమైన ప్రమాదం కలగవచ్చు.

1. స్టెరాయిడ్స్ (Steroids) దుష్ప్రభావాలు

* రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మధుమేహం తీవ్రతరం కావచ్చు.

* రక్తపోటు పెరగడం, శరీరంలో నీరు నిల్వ ఉండటం.

* రోగనిరోధక శక్తి తగ్గి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు రావడం.

* ఎముకలు బలహీనపడటం, కడుపులో అల్సర్లు వచ్చే ప్రమాదం.

1. యాంటీబయాటిక్స్ (Antibiotics) దుర్వినియోగం

* అవసరం లేకుండా వాడితే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుతుంది.

* భవిష్యత్తులో సాధారణ ఇన్ఫెక్షన్లకు కూడా మందులు పనిచేయకపోవచ్చు.

* తీవ్రమైన అలర్జీలు, కిడ్నీ మరియు కాలేయ సమస్యలు రావచ్చు.

* సరైన మందు, మోతాదు, వ్యవధి పాటించకపోతే ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గకపోవచ్చు.

1. నొప్పి నివారణ మందులు (Pain Killers) దుర్వినియోగం

* కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం.

* గ్యాస్ట్రిక్ అల్సర్లు, కడుపులో రక్తస్రావం.

* రక్తపోటు పెరగడం, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం.

* అధిక మోతాదులో లేదా ఇతర మందులతో కలిపి వాడితే తీవ్రమైన దుష్ప్రభావాలు.

TGMC హెచ్చరిక – నకిలీ వైద్యులకు ఇకపై ఉపేక్ష లేదు!

ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదు.

రాష్ట్రవ్యాప్తంగా నకిలీ వైద్యులు, అనధికార వైద్య కేంద్రాలపై TGMC నిరంతర తనిఖీలు నిర్వహిస్తుంది. ప్రజల ఆరోగ్యానికి, ప్రాణాలకు ముప్పు కలిగించే ఇలాంటి అక్రమ వైద్య కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు.

ఇకపై నకిలీ వైద్యులకు హెచ్చరిక మాత్రమే కాదు – చట్టపరమైన చర్యలు తప్పవు! అర్హత లేకుండా అల్లోపతి వైద్యం చేయడం, అనుమతులు లేకుండా వైద్య కేంద్రాలు నిర్వహించడం, విచ్చలవిడిగా స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మందులు వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.

గ్రామీణ ప్రాంతాల్లో అమాయక ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని వైద్యం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వ్యక్తుల పట్ల TGMC ఉపేక్షించదు.

ప్రజలకు TGMC సూచనలు

* వైద్యం చేయించుకునే ముందు వైద్యుని గుర్తింపు పొందిన వైద్య విద్యార్హతలు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరిగా పరిశీలించండి.

* కేవలం RMP, డాక్టర్, క్లినిక్ వంటి బోర్డులు పెట్టుకున్నంత మాత్రాన వారు అర్హత కలిగిన వైద్యులు కారు.

* రిజిస్టర్డ్ వైద్యుని సరైన సలహా లేకుండా ఇంజెక్షన్లు, సెలైన్లు, యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ తీసుకోవద్దు.

* తక్షణ ఉపశమనం కోసం అధిక మోతాదులో మందులు ఇచ్చే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి.

* దీర్ఘకాలిక వ్యాధులకు అర్హత కలిగిన వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స పొందండి.

నకిలీ వైద్యులపై సమాచారం ఇవ్వండి

నకిలీ వైద్యులు, అర్హత లేని వ్యక్తులు అల్లోపతి వైద్యం చేస్తున్నట్లు గుర్తిస్తే ప్రజలు నిర్భయంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలని కోరుతున్నాము.

ఫిర్యాదుల కోసం WhatsApp: 9154382727

నకిలీ వైద్యుల పేరు, గ్రామం, వైద్య కేంద్రం వివరాలు, అందుబాటులో ఉన్న ఆధారాలను WhatsApp ద్వారా తెలియజేయండి.

ప్రజారోగ్య పరిరక్షణ మా బాధ్యత – నకిలీ వైద్యుల అక్రమాలకు అడ్డుకట్ట వేయడం మా సంకల్పం!

– తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC)

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST