Warangal: కాకతీయ వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా 'ఉత్కర్ష్-2026' హెల్త్ రన్!
Warangal: వరంగల్ కాకతీయ వైద్య కళాశాల 'ఉత్కర్ష్-2026' వార్షికోత్సవాల్లో భాగంగా నశా ముక్త్ భారత్ అభియాన్ పై అవగాహన హెల్త్ రన్. హాజరైన సీపీ ఎన్. శ్వేత.
Warangal: కాకతీయ వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా 'ఉత్కర్ష్-2026' హెల్త్ రన్!
Warangal: వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల వార్షికోత్సవాలు ‘ఉత్కర్ష్-2026’లో భాగంగా నవంబర్ 11 నుంచి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా, నశా ముక్త్ భారత్ అభియాన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బుధవారం కళాశాల విద్యార్థులు హెల్త్ రన్, హెల్త్ వాక్ నిర్వహించారు.
బుధవారం ఉదయం 6:30 గంటలకు కాకతీయ వైద్య కళాశాల నుంచి హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ విద్యాసంస్థగా గుర్తింపు పొందిన కాకతీయ వైద్య కళాశాల విద్యార్థుల ద్వారా డ్రగ్స్ వ్యతిరేక సందేశం సమాజంలోని అన్ని వర్గాలకు, ముఖ్యంగా యువతకు చేరడం అభినందనీయమన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల నిర్మూలన అనేది ఒక్క పోలీసు శాఖ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు వచ్చి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం విద్యార్దులచే ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ రన్, హెల్త్ వాక్ కాకతీయ వైద్య కళాశాల నుంచి పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు కొనసాగింది. మార్గమధ్యంలోని సీపీఓ జంక్షన్లో వైద్య కళాశాల విద్యార్థులు నాటక, నృత్య ప్రదర్శనల ద్వారా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. అనంతరం పోలీస్ హెడ్‌క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు ‘Say No to Drugs’ నినాదంతో మానవహారం ఏర్పాటు చేసి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తమ ఐక్యతను, సంకల్పాన్ని చాటారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, వరంగల్ ఇన్చార్జి ఏసీపీ నరసింహారావు, హనుమకొండ, మట్టెవాడ ఇన్స్పెక్టర్లు మచ్చ శివకుమార్, కర్ణాకర్, డ్రగ్ కంట్రోల్ టీమ్ ఇన్స్పెక్టర్ సాయిరమణ, కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.మోహన్ దాస్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్, హెల్త్ రన్ కోఆర్డినేటర్లు షణ్ముఖ్, వసంత్, కాకతీయ వైద్య కళాశాల, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులు కలిపి సుమారు 600 మంది పాల్గొన్నారు.




