Wardhannapet: వంద రోజుల హామీలు వెయ్యి రోజులైనా అమలు చేయలేదు!
Wardhannapet: వర్ధన్నపేటలో కాంగ్రెస్ 1000 రోజుల పాలనా వైఫల్యాలపై మాజీ ఎమ్మెల్యే రమేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ 100 అడుగుల ఫ్లెక్సీతో ర్యాలీ, జాతీయ రహదారిపై రాస్తారోకో.
Wardhannapet: వంద రోజుల హామీలు వెయ్యి రోజులైనా అమలు చేయలేదు!
Wardhannapet: అబద్ధపు బూటకపు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని వెయ్యి రోజులైనప్పటికీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా బూటకపు మాటలు చెబుతూ కాంగ్రెస్ పార్టీ కాలం వెళ్లబుచ్చుతుందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎద్దేవా చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన నేపథ్యంలో, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ 100 అడుగుల ఫ్లెక్సీ పై కాంగ్రెస్ వైఫల్యాలను ముద్రించి భారీ ర్యాలీ నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలులో పూర్తిస్థాయిలో విఫలమైందని ఆరూరి రమేష్ అన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, యువతకు ఉద్యోగాలు, మహిళలకు ఇచ్చిన హామీలు, ఇందిరమ్మ ఇళ్ల వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు ఈ క్రమంలో వరంగల్ టు ఖమ్మం జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో కొంత సమయం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది పోలీసులకు టిఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది పోలీసులు వారిని విస్వరించి ట్రాఫిక్ క్లియర్ చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వారి డిమాండ్ చేశారు లేని పక్షంలో గ్రామాలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి ప్రజా సమస్యలను ఎండగట్టి ఉద్యమం మరింత ఉధృతంగా మారుస్తామని వారు తెలిపారు.




