Achanta: ఆచంట 914 మంది రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు
Achanta: ఆచంటలో 914 మంది రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆకాంక్ష.
Achanta: ఆచంట 914 మంది రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు
ఆచంట: ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్ర మండలం మార్టేరు, సత్యవరం గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ 914 మంది రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని మళ్లీ ప్రజా పరిపాలనలో భాగస్వామి కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని ఆయన అన్నారు.
కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, భూ రికార్డులను పారదర్శకంగా నిర్వహిస్తూ రైతులకు అవసరమైన సేవలను సకాలంలో అందిస్తోందని తెలిపారు. పట్టాదార్ పాస్ పుస్తకాలు భూ యాజమాన్యానికి అధికారిక ధ్రువీకరణగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేశామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెరిగిన పెన్షన్లు, 'తల్లికి వందనం' వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి, పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
మార్టేరు ఇళ్ల పట్టాల పంపిణీ సమయంలో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారంటూ మాజీ ఎమ్మెల్యేపై విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలులో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు, డ్వాక్రా మహిళలు, రైతులు పాల్గొన్నారు.




