Penumantra: సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.. 34% బీసీ రిజర్వేషన్లపై హర్షం!

Penumantra: స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై పెనుమంట్ర మండలం పొలమూరులో సీఎం చంద్రబాబు చిత్రపటానికి బీసీ నేతలు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 19 Aug 2026 10:50 PM IST
Penumantra
X

Penumantra: సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.. 34% బీసీ రిజర్వేషన్లపై హర్షం!

పెనుమంట్ర: రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై బిసి సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం పెనుమంట్ర మండలం పొలమూరు శెట్టి బలిజ రామాలయం వద్ద సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని మరింత పెంచే ఈ నిర్ణయం చారిత్రాత్మక ఘట్టమని క్లస్టర్ ఇంచార్జ్ చింతపల్లి రామకృష్ణ పేర్కొన్నారు. బీసీలకు సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు బీసీలకు 20 శాతం రిజర్వేషన్లను అమల్లోకి తీసుకువచ్చారని రామకృష్ణ గుర్తు చేశారు.

నాడు ఎన్టీఆర్ బీసీలకు రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యున్నతికి బాటలు వేస్తే.. నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకు వేసి బీసీల రిజర్వేషన్ కోటాను 34 శాతానికి పెంచడం సంతోషకరమన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు అధిక ప్రాతినిధ్యం లభించడం ద్వారా గ్రామస్థాయి నుంచి రాజకీయంగా బీసీలు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మండల కార్యదర్శి గూడూరు మురళి అన్నారు.

ప్రజాప్రతినిధులుగా బీసీల సంఖ్య పెరగడం వల్ల వారి సమస్యలను పాలనలో మరింత సమర్థవంతంగా ప్రస్తావించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. బీసీల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వారికి మరింత భరోసా కల్పిస్తున్నాయని నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ షేక్ సయ్యద్ అలీజిన్నా తెలిపారు.

ఇచ్చిన మాటను నిలబెట్టుకుని బీసీలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బీసీల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు షేక్ సయ్యద్ అలీ జిన్నా చెప్పారు. బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇదే స్ఫూర్తితో మరిన్ని నిర్ణయాలు తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

సామాజిక న్యాయం లో భాగంగా బీసీలకు రాజకీయంగా, సామాజికంగా సముచిత స్థానం కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని స్వాగతిస్తున్నట్లు బిసి సంఘ నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు గుడాల వెంకటేశ్వరరావు, మేడిశెట్టి నాగేశ్వరరావు, చింతపల్లి చందర్రావు, సుందరయ్య, పాలసముద్రం, పిల్లి సుబ్బారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story