Amalapuram: అమలాపురం కలెక్టరేట్‌లో భగీరథ మహర్షి జయంతి ఘనంగా

Amalapuram: అమలాపురంలో భగీరథ మహర్షి జయంతి ఘనంగా జరిగింది. కలెక్టర్ మహేష్ కుమార్ నివాళులర్పించి నీటి సంరక్షణపై పిలుపునిచ్చారు.

PRABHU, RAZOLE
Published on: 23 April 2026 11:43 AM IST
Amalapuram
X

Amalapuram

Amalapuram: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం కలెక్టరేట్‌లో మహర్షి భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ భగీరథుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ భగీరథ మహర్షి పట్టుదల, సేవాభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని కలెక్టర్ పేర్కొన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి గంగానదిని భూమికి తెచ్చిన మహనీయుడిగా భగీరథుని చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. అందుకే గొప్ప ప్రయత్నాలను ‘భగీరథ ప్రయత్నం’గా పిలుస్తారని వివరించారు.

లక్ష్యం పట్ల అంకితభావం, పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైన పనినైనా సాధించవచ్చని భగీరథుని జీవితం యువతకు గొప్ప సందేశమని తెలిపారు. ప్రభుత్వం ప్రతి ఏడాది భగీరథ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని, ఈ వేడుకల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

భగీరథుని ఆశయాలకు అనుగుణంగా సమాజంలో నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి జ్యోతిలక్ష్మి దేవి, సిబ్బంది పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story