Bhimavaram: రొయ్యల మేత ధరల పెంపుపై ఆక్వా రైతుల తీవ్ర ఆగ్రహం

Bhimavaram: భీమవరంలో రొయ్య మేత ధరల పెంపుపై ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీడ్ ధరల నియంత్రణలో కూటమి ప్రభుత్వం విఫలమైందని హైకోర్టు స్టే తెచ్చామన్నారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 4 Sept 2026 11:00 PM IST
Bhimavaram
X

Bhimavaram: రొయ్యల మేత ధరల పెంపుపై ఆక్వా రైతుల తీవ్ర ఆగ్రహం

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో రొయ్య మేత (ఫీడ్) ధరలు మరోసారి పెరగడంపై ఆక్వా రైతు సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఆక్వా రైతుల ప్రయోజనాలను విస్మరిస్తోందని వారు విమర్శించారు.

​భీమవరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆక్వా రైతు సంఘం నాయకులు తులసీ రాంబాబు, సుబ్బరాజు, శ్రీనివాస్ రాజు, చంద్రశేఖర్ మాట్లాడారు. మేత తయారీ కంపెనీల యజమానులు ఇప్పటికే పలుమార్లు ధరలు పెంచారని, తాజాగా మళ్లీ ధరలు పెంచడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.

​ప్రభుత్వం ఫీడ్ కంపెనీల యజమానుల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయలేకపోతోందని, అందుకే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని నాయకులు తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి పెంచిన మేత ధరలను ఈ నెలాఖరు వరకు నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించారు.రాష్ట్రంలో ఆక్వా రంగం రూ.లక్ష కోట్లకు చేరాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబుతున్నారని, కానీ నిత్యం ఫీడ్ ధరలు పెరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.

​ గుజరాత్ ప్రభుత్వం అక్కడ ఆక్వా రైతులను అన్ని విధాలా ఆదుకుంటోందని, వారిని చూసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిగ్గుపడాలని విమర్శించారు. ఏపీలో మాత్రం రైతులు తీవ్ర నష్టాల బారిన పడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

​పెంచిన మేత ధరలను వెంటనే ఉపసంహరించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని రైతు నాయకులు హెచ్చరించారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

Next Story