Bhimavaram: ఆక్వా రైతులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు - కలెక్టర్

Bhimavaram: ఆక్వా రైతులకు సంక్షేమ పథకాలు, బీమా సదుపాయాలు అందేలా చూడాలని మత్స్యశాఖ అధికారులను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 7 Oct 2026 11:24 PM IST
Bhimavaram
X

Bhimavaram: ఆక్వా రైతులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు - కలెక్టర్

భీమవరం: జిల్లాలో ఆక్వా రైతులకు ప్రభుత్వ పథకాలు, సాంకేతిక సేవలు, బీమా సదుపాయాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు.

బుధవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మత్స్యశాఖ అధికారులతో ఆక్వా కల్చర్ విస్తరణ, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఆక్వా ల్యాబ్ సేవలు, ఎన్‌ ఎఫ్‌ డీపీ రిజిస్ట్రేషన్, ఎంపెడా పరిధిలోని చెరువుల నమోదు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె మండలాల వారీగా సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అర్హత కలిగిన ఆక్వా రైతులు, ఆక్వా చెరువుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఒక నెల గడువులోగా పూర్తి చేయాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు రిజిస్ట్రేషన్ వల్ల కలిగే ప్రయోజనాలను అవగాహన కల్పించాలన్నారు. ఆక్వా రంగంలో రైతులు నష్టాలను నివారించేందుకు ఆక్వా ల్యాబ్‌ల సేవలను మరింత విస్తృతం చేయాలని సూచించారు.

రైతులు నీటి నాణ్యత, మట్టి నాణ్యత తదితర అంశాలకు సంబంధించి పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలని, ల్యాబ్‌ల ద్వారా రైతులకు అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించి అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని ఆదేశించారు.

ఎన్ ఎఫ్ డి పి రిజిస్ట్రేషన్ ప్రాధాన్యతను రైతులకు వివరించాలని అన్నారు. ముఖ్యంగా ఆక్వా రైతులకు వర్తించే బీమా పథకాలపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి రైతు బీమా సదుపాయాన్ని వినియోగించుకునేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు.

అలాగే ఎంపెడా పరిధిలోని ఆక్వా చెరువుల నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నమోదు కాని చెరువులను గుర్తించి, సంబంధిత రైతులకు అవసరమైన మార్గదర్శకాలు అందిస్తూ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులు ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా మత్స్య శాఖ అధికారి డాక్టర్ బి శ్రీనివాస్, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM