Bhimavaram: భీమవరంలో శివాజీ శౌర్య యాత్రను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస వర్మ
Bhimavaram: భీమవరంలో ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన శివాజీ శౌర్య యాత్రను కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రారంభించి, స్వయంగా పాల్గొన్నారు.
Bhimavaram: భీమవరంలో శివాజీ శౌర్య యాత్రను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస వర్మ
భీమవరం: చత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవాన్ని పురస్కరించుకుని 'హిందూ సామ్రాజ్య దినోత్సవం' సందర్భంగా భీమవరంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (RSS) ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన 'శౌర్య యాత్ర' అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ శౌర్య యాత్రను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన హిందూ బంధువులతో కలిసి కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ఈ యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
చినఅమిరం లోని విజ్ఞాన భారతి స్కూల్ ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ శౌర్య యాత్ర.. అడ్డ వంతెన సెంటర్, అంబేద్కర్ సెంటర్, ప్రకాశం చౌక్ మీదుగా వీసాకోడేరు రామాలయం వరకు హిందూ బంధువుల నీరాజనాల నడుమ అద్భుతంగా సాగింది.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ మహారాజ్ యుద్ధరంగంలో ఎంత గొప్ప వీరుడో, పరిపాలనలోనూ అంతే గొప్ప దూరదృష్టి కలిగిన నాయకుడని కొనియాడారు. రైతుల సంక్షేమం కోసం ఆయన అహర్నిశలు పనిచేశారని, ఆయన పాలనలో అవినీతికి, అన్యాయానికి ఏమాత్రం తావులేదని స్పష్టం చేశారు.
సమాజంలో మహిళల పట్ల శివాజీ మహారాజ్ చూపిన గౌరవం నేటికీ అందరికీ ఆదర్శనీయమని కేంద్రమంత్రి అన్నారు. యుద్ధాలలో శత్రు రాజ్యాల మహిళలు చిక్కినా, వారిని అత్యంత గౌరవంగా వారి కుటుంబాలకు సురక్షితంగా పంపించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. నేటి సమాజం ఆయన జీవితం నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయని ఉద్ఘాటించారు.
శివాజీ మహారాజ్ కేవలం భూమిపై మాత్రమే కాకుండా సముద్రంపై కూడా భారత శక్తిని విశ్వవ్యాప్తంగా చాటారని, భారతదేశపు తొలి శక్తివంతమైన నౌకాదళాన్ని నిర్మించి దేశ భద్రతకు కొత్త దిశను నిర్దేశించారని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ గుర్తుచేశారు. తన వ్యక్తిగత సుఖాల కోసం కాకుండా, ప్రజల ఆత్మగౌరవం కోసం జీవించిన ఏకైక మహానాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కీర్తించారు.
ప్రపంచ చరిత్రలో ఎంతో మంది రాజులు వచ్చారు, వెళ్లిపోయారు, కానీ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన అతి కొద్దిమంది రాజుల జాబితాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అగ్రస్థానంలో ఉంటారని శ్రీనివాస వర్మ అన్నారు.




