Bhimavaram: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ అభినందనీయం
Bhimavaram: భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ కళాశాలలో వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కొనియాడారు.
Bhimavaram: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ అభినందనీయం
భీమవరం: ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కొనియాడారు. మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ప్రపంచంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందన్నారు.
భీమవరంలోని ఎస్.ఆర్.కె.ఆర్. కళాశాలలో పశ్చిమగోదావరి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వికసిత్ భారత్ సంకల్ప సభ’లో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా ఢిల్లీలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని ఎల్.ఈ.డీ. తెరపై వీక్షించిన అనంతరం నాయకులు, విద్యార్థులు ‘వికసిత్ భారత్’ ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస వర్మ మాట్లాడుతూ 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ, 13 ఏళ్ల పాటు గుజరాత్‌ను అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు, 12 ఏళ్లుగా ప్రధానమంత్రిగా దేశ ప్రగతి కోసం అహర్నిశలు పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేపథ్యం నుంచి వచ్చిన మోదీకి దేశభక్తి, దేశ సేవ పట్ల నిబద్ధత ఎంతో ఎక్కువన్నారు.
2014కు ముందు సుదీర్ఘకాలం సంకీర్ణ ప్రభుత్వాల కారణంగా రాజకీయ అస్థిరత నెలకొందని, పూర్తి మెజారిటీ లేకపోవడంతో అనేక సందర్భాల్లో నిర్ణయాత్మక పాలన సాధ్యం కాలేదని శ్రీనివాస వర్మ అన్నారు. 2014లో ప్రజలు బీజేపీకి పూర్తి మెజారిటీ అందించడంతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడి, దేశంలో సమగ్ర అభివృద్ధికి బాటలు పడ్డాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అగ్రస్థానాల వైపు దూసుకెళ్తోందని, అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట గణనీయంగా పెరిగిందని అన్నారు.
ప్రపంచ దేశాల అధినేతలు ప్రధాని మోదీకి ఇస్తున్న ప్రాధాన్యత, భారతదేశానికి పెరిగిన గౌరవానికి నిదర్శనమని తెలిపారు. ప్రధాని మోదీ ప్రభుత్వం పేదలు, సామాన్యుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. జన్‌ధన్ ఖాతాలు, మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్ సౌకర్యాల విస్తరణ, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు వంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమానికి నిదర్శనమన్నారు.
2014కు ముందు, అనంతరం విద్యా, వైద్య రంగాల్లో వచ్చిన మార్పులను ఐఐటీలు, ఐఐఎంలు, వైద్య, ఇంజనీరింగ్ విద్యాసంస్థల సంఖ్యతో పాటు యువత స్వయంగా పరిశీలించాలని సూచించారు. నేటి యువత, విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటును సద్వినియోగం చేసుకుని 2014కు ముందు, ఆ తర్వాత దేశంలో జరిగిన అభివృద్ధిని వాస్తవాల ఆధారంగా విశ్లేషించుకోవాలని శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు. ఎలాంటి స్వార్థం లేకుండా దేశాన్నే దైవంగా భావించి పనిచేస్తున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని, ఆయన నాయకత్వాన్ని బలపరచడం ద్వారా భారతదేశాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ బీజేపీ కంటే భారతదేశం ఎంతో గొప్పదని, భారతదేశ సత్తా, యువత ప్రతిభ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు తమ ప్రతిభతో రాణిస్తున్నారని, దేశాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దడమే బీజేపీ, ప్రధాని మోదీ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వాల కాలంలో టెలిఫోన్, గ్యాస్ వంటి కనెక్షన్ల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని, నేడు . ప్రధాని మోదీ నాయకత్వంలో సాంకేతికత సామాన్యుడి జీవితంలో భాగమైందని అన్నారు. దేశ భద్రత విషయంలోనూ భారత్ గతంతో పోలిస్తే మరింత శక్తివంతంగా మారిందని, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో భద్రతా దళాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ, మద్దతు కల్పిస్తోందని తెలిపారు.
76 ఏళ్ల వయసులోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో చురుకుగా పనిచేస్తూ దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, నేటి యువతకు ఆయన స్ఫూర్తిదాయకమైన ‘జెన్-జీ’ నాయకుడని సోము వీర్రాజు అభివర్ణించారు. మోదీని ఆదర్శంగా తీసుకుని నవభారత నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక, రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, రాష్ట్ర మీడియా సెల్ సభ్యులు కపర్ది, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుభాష్ రాజు, కాయిత సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శులు కలిదిండి వినోద్ వర్మ, తోట గంగరాజు తదితర నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




