Bhimavaram: పిల్లల భవిష్యత్తుకు పోషకాహారమే పునాది: కలెక్టర్ చదలవాడ నాగరాణి!
Bhimavaram: పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పోషకాహారమే పునాది: పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. భీమవరం కలెక్టరేట్‌లో 9వ జాతీయ పోషణ మాసం స్టాల్స్ పరిశీలన.
Bhimavaram: పిల్లల భవిష్యత్తుకు పోషకాహారమే పునాది: కలెక్టర్ చదలవాడ నాగరాణి!
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు సరైన పునాది పోషకాహారం, ప్రేమతో కూడిన సంరక్షణేనని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. చిన్నారులకు బాల్యం నుంచే సమతుల్యమైన పోషకాహారం అందించడం ద్వారా వారి శారీరక, మానసిక ఎదుగుదలకు బలమైన పునాది ఏర్పడుతుందని తెలిపారు.
9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా పోషణ ఆహారం తగినంత ప్రోటీన్ సమాజ భాగస్వామ్యం అనే అంశంపై జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోషణ స్టాల్‌ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు.స్టాల్‌లో ఏర్పాటు చేసిన పోషకాహార పదార్థాలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తదితరాలను పరిశీలించారు. వాటి పోషక విలువలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబరు 9వ తేదీ నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు నిర్వహిస్తున్న 9వ జాతీయ పోషకాహార మహోత్సవాలు కార్యక్రమాలను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.మన పోషణ మన కుటుంబానికి బలం అనే భావన ప్రతి కుటుంబంలో పెంపొందాల్సిన అవసరం ఉందన్నారు. మన చుట్టూ అందుబాటులో ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, పప్పుదినుసులు, ప్రోటీన్‌తో కూడిన ఆహార పదార్థాలను నిత్య ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. కాలానుగుణంగా లభించే స్థానిక ఆహార పదార్థాలను వినియోగించడం ద్వారా తక్కువ ఖర్చుతోనే కుటుంబానికి అవసరమైన పోషకాలను అందించవచ్చని తెలిపారు.
పిల్లలు, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు తప్పనిసరిగా పోషకాహారం తీసుకునేలా కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. పోషణతో ఆరోగ్యం అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆరోగ్యకరమైన బాల్యం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, తల్లులు, గర్భిణీలు, కిశోర బాలికలకు పోషకాహారంపై అవగాహన కల్పించడంతో పాటు, పోషకాహార లోపాన్ని గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
బిడ్డ పుట్టినప్పటి నుంచి మొదటి వెయ్యి రోజులు బిడ్డ శారీరక, మానసిక, మెదడు ఎదుగుదలకు అత్యంత కీలకమైనవని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ కాలంలో తల్లి, బిడ్డకు తగిన పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రత, ప్రేమతో కూడిన సంరక్షణ అందించాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉందన్నారు.
ఆరు నెలల వయస్సు వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆరు నెలలు పూర్తయిన తరువాత వయస్సుకు తగిన అదనపు ఆహారాన్ని క్రమంగా పరిచయం చేయాలని సూచించారు. బిడ్డ ఎంత తింటోంది, బిడ్డ బరువు, ఎదుగుదల ఎలా ఉంది అనే విషయాలను అంగన్వాడీ సిబ్బంది, తల్లిదండ్రులు నిరంతరం గమనించాలని అన్నారు.బిడ్డ ఎదుగుదలను తెలుసుకోవాలంటే బిడ్డ ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలించాలి. ప్రతి చిన్నారికి సరైన పోషణతో పాటు ప్రేమ, ప్రేరణ, శ్రద్ధ అవసరం” అని కలెక్టర్ పేర్కొన్నారు.
అంగన్వాడీ కేంద్రాలు సమాజ భాగస్వామ్యంతో పోషణ ఉద్యమం మన అంగన్వాడీ మన బాధ్యత అనే భావనతో ప్రతి ఒక్కరూ అంగన్వాడీ కేంద్రాల కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారం, ఆరోగ్య సేవలు, బాలల ఎదుగుదల పర్యవేక్షణ వంటి కార్యక్రమాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పోషకాహార లోపం ఉన్న పిల్లలను ముందుగానే గుర్తించి వారికి అవసరమైన వైద్య, పోషకాహార సేవలు అందేలా అంగన్వాడీ, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో పోషకాహారం పై అవగాహన పెంచేందుకు మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, యువత భాగస్వామ్యం కావాలని కోరారు.
పోషకాహారం శారీరక ఎదుగుదలకు మాత్రమే కాకుండా మెదడు ఎదుగుదలకు కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రతి చిన్నారి ఆరోగ్యంగా, ఆనందంగా ఎదగడం కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సేవలను అర్హులైన ప్రతి కుటుంబం వినియోగించుకునేలా అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి డి శ్రీలక్ష్మి, డిస్టిక్ కో ఆర్డినేటర్ పి. చంద్రశేఖర్ , నోడల్ అధికారి విజయలక్ష్మి, సి డి పి ఓ లు, సూపర్వైజర్లు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




