Penumantra: జాతీయ కోచ్‌గా పెనుమంట్ర యువతి అరుదైన ఘనత!

Penumantra: పెనుమంట్ర మండలానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి కోడి తేజస్విని వెంకట శైలజ అంతర్జాతీయ పతకాలు సాధించడమే కాకుండా జాతీయ స్థాయి కోచ్‌గా అర్హత సాధించారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 10 Aug 2026 8:43 PM IST
Penumantra
X

Penumantra: జాతీయ కోచ్‌గా పెనుమంట్ర యువతి అరుదైన ఘనత!

పెనుమంట్ర: పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం పరిధిలోని పంపనవారిపాలేనికి చెందిన కోడి తేజస్విని వెంకట శైలజ... కేవలం ఏడేళ్లలోనే బాక్సింగ్ రంగంలో అద్భుత విజయాలు నమోదు చేసింది. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన శైలజ... తన పట్టుదలతో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించి గుర్తింపు తెచ్చుకుంది.

2022లో నేపాల్‌లో జరిగిన అంతర్జాతీయ ఓపెన్ సీనియర్ బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించి భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది. జాతీయ స్థాయి పోటీల్లో తొమ్మిది సార్లు పాల్గొని రెండు బంగారు, నాలుగు వెండి పతకాలు గెలుచుకుంది. రాష్ట్ర స్థాయిలో 16 బంగారు, 8 వెండి పతకాలతో పాటు ఐదు సార్లు ఉత్తమ బాక్సర్ అవార్డులు అందుకుంది. జిల్లా స్థాయిలోనూ 12 బంగారు, 8 వెండి పతకాలు సాధించి తన ప్రతిభను చాటుకుంది.

ఆటగాడిగా మాత్రమే కాకుండా కోచ్‌గా కూడా తన ప్రతిభను నిరూపించుకుంది శైలజ. పంజాబ్‌లోని పటియాలాలో ఉన్న నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ నిర్వహించిన ఆరు వారాల బాక్సింగ్ కోచ్ సర్టిఫికేట్ కోర్సును 'ఏ' గ్రేడ్‌తో విజయవంతంగా పూర్తి చేసి జాతీయ స్థాయి కోచ్‌గా అర్హత సాధించింది.

ప్రస్తుతం 30 మంది విద్యార్థులకు ఉచితంగా బాక్సింగ్ శిక్షణ అందిస్తూ... గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తోంది. అదే సమయంలో సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతూ... ఐఏఎస్ అధికారి కావాలన్న తన కలను సాకారం చేసుకునేందుకు కృషి చేస్తోంది.

"చిన్నప్పటి నుంచి క్రీడలంటే చాలా ఇష్టం. అనుకోకుండా బాక్సింగ్‌లోకి వచ్చాను. అదే నా జీవితాన్ని మార్చేసింది. ఒక చిన్న గ్రామానికి చెందిన నేను ప్రపంచానికి పరిచయం కావడానికి బాక్సింగ్ కారణమైంది. ఇప్పుడు కోచ్‌గా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాను. అదే సమయంలో సివిల్స్‌కు సిద్ధమవుతున్నాను. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే ఇంకా ఎన్నో విజయాలు సాధించి దేశానికి మరిన్ని పతకాలు తీసుకురావాలనుకుంటున్నాను."

వ్యవసాయ కుటుంబానికి చెందిన శైలజ తల్లిదండ్రులు కోడి ఏడుకొండలు, మంగరత్నం చిన్న బడ్డీ కొట్టుతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. కూతురు సాధించిన ప్రతి విజయానికి వెన్నుదన్నుగా నిలిచిన వారు... ఆమె ఐఏఎస్ అధికారి కావాలని చిరకాలంగా కలలు కంటున్నారు.

"మా అమ్మాయి చిన్నప్పటి నుంచే కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. దేశానికి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు ఐఏఎస్ కావాలన్నది మా కోరిక. ప్రభుత్వం సహాయం చేస్తే ఇంకా ఉన్నత స్థాయికి చేరుకుంటుందని నమ్ముతున్నాం."

మట్టిలో పుట్టిన ఈ మాణిక్యం... బాక్సింగ్ రింగ్‌లో పంచ్‌లతో విజయాలను అందుకోవడమే కాదు... సమాజానికి స్ఫూర్తినిచ్చే గురువుగా మారింది. ఇప్పుడు ఐఏఎస్ లక్ష్యంతో మరో పోరాటానికి సిద్ధమవుతోంది. సరైన ప్రోత్సాహం లభిస్తే ఈ గ్రామీణ యువతి భారతదేశానికి మరిన్ని కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావడం ఖాయం.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story