Penumantra: మార్టేరు పీహెచ్‌సీలో బాలింతలకు నగదు, కిట్ల పంపిణీ!
Penumantra: పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు పీహెచ్‌సీలో సాధారణ ప్రసవం పొందిన మహిళలకు రూ.2,500 నగదు, బేబీ కేర్ కిట్లు అందజేశారు.
Penumantra: మార్టేరు పీహెచ్‌సీలో బాలింతలకు నగదు, కిట్ల పంపిణీ!
Penumantra: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పెనుమంట్ర తహసీల్దార్ టి. రాజరాజేశ్వరి కోరారు. గర్భిణీలు వైద్యుల సూచనలు పాటిస్తూ పోషకాహారం తీసుకోవడంతో పాటు సాధారణ ప్రసవాలపై అపోహలు, అనవసర భయాలను వీడాలని సూచించారు.
మార్టేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సాధారణ ప్రసవం పొందిన గర్భిణీలకు రూ.2,500 నగదు ప్రోత్సాహకం, సంరక్షణ కిట్లను అందజేశారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సహకారంతో పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్, పారిశ్రామికవేత్త కర్రి అచ్యుత రామారెడ్డి ఆధ్వర్యంలో గర్భిణీలకు ఉచిత భోజనం, సంరక్షణ కిట్లు, నగదు ప్రోత్సాహకాలు అందించడం అభినందనీయమని తహసీల్దార్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ రాజరాజేశ్వరి మాట్లాడుతూ.. ‘‘గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలను నిర్లక్ష్యం చేయవద్దు. గర్భధారణ సమయంలో మంచి ఆహారం తీసుకుంటూ వైద్యుల సలహాలు పాటించాలి. సాధారణ ప్రసవం కోసం అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని సూచించారు.
ఆపరేషన్ ద్వారా ప్రసవం చేయించుకుంటే కుటుంబంపై అదనపు ఆర్థిక భారం పడుతుందని, ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్ ప్రసవాలకు రూ.50 వేలకుపైగా ఖర్చయ్యే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. గర్భిణీలకు మెరుగైన వైద్యం, పోషకాహారం, అవసరమైన సంరక్షణ అందించేందుకు వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారులు, స్థానిక కూటమి నాయకులు, ఆశా కార్యకర్తలు, పీహెచ్‌సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




