Kukunoor: కార్మికులకు అందని సంక్షేమ పథకాలు.. అధికారుల తీరుపై సిఐటియు నిరసన!
Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరులో భవన నిర్మాణ కార్మికుల విస్తృతస్థాయి సమావేశం.
Kukunoor: కార్మికులకు అందని సంక్షేమ పథకాలు.. అధికారుల తీరుపై సిఐటియు నిరసన!
ఏలూరు జిల్లా: కుక్కునూరు మండల కేంద్రంలోని చర్చి హాస్టల్ ప్రాంగణంలో భగత్‌సింగ్ భవన నిర్మాణ కార్మిక సంఘం విస్తృతస్థాయి సమావేశం సంఘం అధ్యక్షులు తోట సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి యర్నం సాయికిరణ్ మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ బోర్డు ద్వారా పలు పథకాలను అమలు చేస్తున్నప్పటికీ, వాటి ప్రయోజనాలు ప్రతి కార్మికుడికి పూర్తిస్థాయిలో అందడం లేదన్నారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా అమలవుతున్న పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేసి అర్హులైన ప్రతి కార్మికుడికి సంక్షేమ ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి యర్నం సాయికిరణ్ డిమాండ్ చేశారు.
కొత్త రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్‌లో జాప్యం జరుగుతోందని, ప్రమాద మరణాలు, వికలాంగత, వైద్య సహాయం వంటి క్లెయిమ్స్ పరిష్కారంలో ఆలస్యం కారణంగా కార్మిక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. నిర్మాణ రంగంలో కనీస వేతనాల అమలు సక్రమంగా జరగడం లేదని, పనిస్థలాల్లో తగిన భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా కార్మికులకు ప్రసూతి, శిశు సంరక్షణ సౌకర్యాలు మరింత మెరుగుపరచాలని, వృద్ధాప్య పెన్షన్, విద్యా సహాయం, వివాహ సహాయం వంటి సంక్షేమ పథకాల మొత్తాలను పెంచాలని కోరారు.
అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రతను విస్తరించి, నిర్మాణ కార్మిక సంక్షేమ నిధులను పూర్తిగా కార్మికుల సంక్షేమానికే వినియోగించాలని కోరారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సంఘటిత పోరాటాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యమాలను కొనసాగిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యర్రంశెట్టి నాగేంద్రరావు, సంఘం జిల్లా కమిటీ సభ్యులు షేక్ సలీమ్ పాషా, సిఐటియు కో.కన్వీనర్ షేక్ వలిపాషా, నాయకులు, పరిటాల సతీష్, బాలుషా, హరిబాబు,ఖాదర్ బాబా,దేవేంద్ర,రాంబాబు,యన్న ప్రసాద్,మస్తాన్ తో పాటుగా భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




