Polavaram: పోలియో కార్యక్రమం బాయ్‌కాట్ చేస్తాం మట్ల వాణిశ్రీ హెచ్చరిక
Polavaram: పోలవరం ఏజెన్సీలో పల్స్ పోలియో బూత్‌ల కుదింపుపై సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు మట్ల వాణిశ్రీ ఆగ్రహం. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని హెచ్చరిక.
Polavaram: పోలియో కార్యక్రమం బాయ్‌కాట్ చేస్తాం మట్ల వాణిశ్రీ హెచ్చరిక
పోలవరం: రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా, మన పోలవరం జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) ల పరిధిలో పోలియో బూత్‌ల సంఖ్యను కుదిస్తూ (తగ్గిస్తూ) వైద్య ఆరోగ్య శాఖ తీసుకున్న నిర్ణయం అత్యంత దుర్మార్గమైనదని, దీనిని పోలవరం జిల్లా CITU తీవ్రంగా ఖండిస్తోందని జిల్లా అధ్యక్షురాలు మట్ల.వాణిశ్రీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లా అంతటా బూత్‌లను యథావిధిగా కొనసాగించకపోతే పల్స్ పోలియో కార్యక్రమం బాయికట్ చెయ్యాల్సి వస్తుందని దీని వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో పోలియో నిర్మూలన ఆశయం దెబ్బతింటుందని ఆమె ఈ సందర్బంగా హెచ్చరించారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న బౌగోలిక పరిస్థితుల రీత్యా గ్రామానికి, గ్రామానికి మధ్య కిలోమీటర్ల కొద్దీ దూరం ఉంటుందని, దట్టమైన అడవులు, కొండ వాగులు ఉంటాయి. నిబంధనల ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ప్రతి 3 కిలోమీటర్ల లోపు లేదా ప్రతి చిన్న ఆవాస ప్రాంతానికి వైద్య సేవలు అందుబాటులో ఉండాలి.
బూత్‌లను కుదించడం వల్ల గిరిజన తల్లులు పసిపిల్లలను చంకనేసుకుని 5 నుండి 10 కిలోమీటర్లు కొండ దారులు, అడవి మార్గాల్లో నడిచి రావాల్సి వస్తుంది.వారితో పాటు ఆశావర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు కూడా వ్యయ ప్రయాశాలతో నడిచి రావలసిన పరిస్థితి ఉంటుంది. ఇది ఆచరణలో అసాధ్యం.
జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) గైడ్‌లైన్స్ ప్రకారం ఒక వ్యాక్సినేటర్ పరిమిత సంఖ్యలో మాత్రమే పిల్లలకు డ్రాప్స్ వేయగలరు. బూత్‌లను తగ్గిస్తే, ఒకే బూత్ పరిధిలోకి ఎక్కువ గ్రామాలు వస్తాయి. దీనివల్ల ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు మారుమూల గ్రామాల నుండి పిల్లలను తరలించడానికి, వారికి వ్యాక్సిన్ వేయించడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పైగా నెట్‌వర్క్ లేని మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ ఎంట్రీలు (CoWIN/U-WIN తరహా యాప్‌లలో) నమోదు చేయడం అదనపు భారం అవుతుంది.
గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు లేక, దూర భారం వల్ల అనేకమంది తల్లులు బూత్‌ల దాకా రాలేకపోవచ్చు. దీనివల్ల "Zero Dose" (ఒక్క చుక్క కూడా వేయించుకోని) పిల్లల సంఖ్య పెరిగి, భవిష్యత్తులో జిల్లాలో పోలియో ముప్పు మళ్లీ పొంచి ఉండే ప్రమాదం ఉంది.
గిరిజన ప్రాంతాల ప్రత్యేక రక్షణ చట్టాలు మరియు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (NRHM) నిబంధనల ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక పరిస్థితులను బట్టి బూత్‌ల సంఖ్యను పెంచాలే తప్ప, కుదించడానికి వీల్లేదనీ ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు మట్ల.వాణిశ్రీ తెలిపారు. ప్రస్తుత వైద్య ఆరోగ్య అధికారుల నిర్ణయం ఈ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం అనీ ఆమె అన్నారు.
పోలవరం జిల్లా కలెక్టర్ గారు గిరిజన ప్రాంతాల ప్రత్యేక భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మానవతా దృక్పథంతో పోలవరం జిల్లాలో పల్స్ పోలియో బూతుల విషయంలో తక్షణమే స్పందించాలని మట్ల.వాణిశ్రీ కోరారు. బూత్‌ల కుదింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: గతంలో లాగే అన్ని PHCల పరిధిలో, ప్రతి మారుమూల గ్రామానికి పోలియో బూత్ అందుబాటులో ఉండేలా పాత బూత్‌లను యథావిధిగా కొనసాగించాలనీ ఆమె డిమాండ్ చేశారు.
మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేయాలి: కొండలపై ఉండే గిరిజన గ్రామాలు మరియు నెట్‌వర్క్ లేని ఏజెన్సీ గ్రామాల కోసం ప్రత్యేక మొబైల్ వ్యాక్సినేషన్ వాహనాలను ఏర్పాటు చేయాలనీ ఆమె కోరారు. అడవి మార్గాల్లో ప్రయాణించే ఆశా, అంగన్‌వాడీ, హెల్త్ వర్కర్లకు తగిన రవాణా భత్యం (TA) మరియు రక్షణ కల్పించాలనీ ఆమె డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్త పల్స్ పోలియో లక్ష్యం 100% విజయవంతం కావాలంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక్క చిన్నారి కూడా మిగిలి పోకూడదు. అధికారులు తమ పట్టింపులను పక్కనబెట్టి, గిరిజన బిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బూత్‌ల తగ్గింపును ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు లేకుండా చేస్తున్న కుదింపును తక్షణమే రద్దు చేయాలని, లేనిపక్షంలో రేపు జిల్లా వ్యాప్తంగా జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని బాయ్ కట్ చేసి,సిఐటియు ఆధ్వర్యంలో గిరిజన తల్లులతో కలిసి పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని సీఐటీయూ పోలవరం జిల్లా అధ్యక్షురాలు మట్ల.వాణిశ్రీ హెచ్చరించారు.




