Polavaram: వరద తగ్గాక పునరుద్ధరణ చర్యలపైనే నజర్: కలెక్టర్ దినేష్‌కుమార్

Polavaram: పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్‌కుమార్ చింతూరు డివిజన్ అధికారులతో వరద తదుపరి పుനరుద్ధరణ చర్యలపై కీలక సమీక్ష నిర్వహించారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 3 Aug 2026 7:02 PM IST
Polavaram
X

Polavaram: వరద తగ్గాక పునరుద్ధరణ చర్యలపైనే నజర్: కలెక్టర్ దినేష్‌కుమార్

పోలవరం: వరదల హెచ్చరిక ఉపసంహరణ అనంతరం పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె. దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సోమవారం చింతూరు డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వరద ప్రభావిత గ్రామాల్లో అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి సమయోచితంగా స్పందించడం వల్ల నష్ట నివారణ చర్యలు సమర్థవంతంగా అమలయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.

రోగానికి చికిత్స కంటే ముందస్తు నివారణ మేలు అనే నానుడిని గుర్తుచేస్తూ, హెచ్చరిక దశలో తీసుకున్న జాగ్రత్తలు సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పారు.కొత్తగా ఏర్పాటు అయిన పోలవరం జిల్లాలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసిన తీరు ప్రశంసనీయమన్నారు.ప్రస్తుతం వరద ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో తదుపరి చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, రహదారులు, వైద్య సేవల పునరుద్ధరణను శాఖలవారీగా పర్యవేక్షించాలని దినేష్ కుమార్ ఆదేశించారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పారు.

ముందస్తుగా రేషన్ పంపిణీ వరదల కారణంగా సెప్టెంబర్ నెల రేషన్ సరుకులను ప్రభుత్వం ముందుగానే విడుదల చేయనున్నందున, క్షేత్రస్థాయిలో నిత్యావసర సరుకుల పంపిణీకి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.పంపిణీ ప్రక్రియలో ఎలాంటి అంతరాయం లేకుండా పర్యవేక్షణ చేపట్టాలని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నోడల్ అధికారులు, మండల స్థాయి ప్రత్యేక అధికారులు వ్యక్తిగత బాధ్యతతో పనిచేయాలని స్పష్టం చేశారు.

వరదల సమయంలో ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు, వరద నీరు తగ్గిన తర్వాత తీసుకోవాల్సిన పారిశుధ్య, ఆరోగ్య, భద్రతా చర్యలపై గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు.వరద నీరు తగ్గిన అనంతరం మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధులు వ్యాపించకుండా అన్ని శాఖల అధికారులు చురుకుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.టేకుబాకలో వరద బాధితులకు కలెక్టర్ దినేష్ కుమార్ నిత్యవసర సరుకులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. ప్రశాంత్‌కుమార్, ఐటీడీఏ చింతూరు ప్రాజెక్టు అధికారి శుభం నోక్వాల్, చింతూరు ఏఎస్పీ బి. హేమంత్ లు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR

Next Story