Bhimavaram: హార్వెస్టింగ్ యంత్రాలకు డీజిల్ కూపన్లు.. రైతులకు ఊరట
Bhimavaram: పశ్చిమ గోదావరి జిల్లాలో వరి కోతలకు డీజిల్ కొరత రాకుండా కలెక్టర్ చదలవాడ నాగరాణి కీలక చర్యలు చేపట్టారు.
Bhimavaram: హార్వెస్టింగ్ యంత్రాలకు డీజిల్ కూపన్లు.. రైతులకు ఊరట
Bhimavaram: జిల్లాలో డీజిల్ సరఫరా పరిస్థితుల నేపథ్యంలో వరి కోతలు ఎక్కడా ఆగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ చాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం హార్వెస్టింగ్ యంత్రాలకు డీజిల్ సరఫరా వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 1,40,000 ఎకరాల్లో వరి కోతలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. ఈ విస్తీర్ణంలో కోత పనులు నిరవధికంగా సాగేందుకు అవసరమైన డీజిల్ సరఫరాను నిర్ధారించడం అత్యంత కీలకమని అన్నారు. హార్వెస్టింగ్ యంత్రాలకు డీజిల్ కొరత కారణంగా ఎక్కడా కోతలు నిలిచిపోకుండా జిల్లా యంత్రాంగం సమగ్ర ప్రణాళికతో పనిచేస్తోందని తెలిపారు.
ఒక హార్వెస్టింగ్ యంత్రానికి రోజుకు 70 లీటర్ల డీజిల్, ట్రాక్టర్‌కు 20 లీటర్ల డీజిల్ సరఫరా చేసే విధంగా రైతు సమైక్య కేంద్రాల ద్వారా కూపన్లను జారీ చేస్తున్నామని వివరించారు. పెట్రోల్ బంకుల్లో ఈ కూపన్ల ఆధారంగా డీజిల్ అందించేందుకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వరి కోత యంత్రాలకు ప్రాధాన్యతనిస్తూ వేగంగా డీజిల్ సరఫరా జరిగేలా విఆర్వోలు, పోలీస్ సిబ్బంది ప్రత్యక్ష పర్యవేక్షణలో చర్యలు తీసుకోవాలని సూచించారు.
అవసరమైతే బంకుల వద్ద రెండు వేర్వేరు క్యూ లైన్లు ఏర్పాటు చేసి ముందుగా హార్వెస్టింగ్ యంత్రాలకు డీజిల్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా డీజిల్ నిల్వలు ఉన్నట్లయితే వాటిని గుర్తించి సంబంధితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
డీజిల్ సరఫరాలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు ఆదేశించారు. త్వరలోనే డీజిల్ సరఫరా పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటుందని కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి వ్యవసాయ కార్యకలాపాలకు, అలాగే సాధారణ ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జెడ్.వెంకటేశ్వర్లు, భీమవరం ఎడిఎ ప్రసాద్, పాలకొల్లు ఏడీఏ మురళీకృష్ణ, అత్తిలి వ్యవసాయ అధికారి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.




