Polavaram: జూలై 1 నుంచి స్పెషల్ డ్యూటీస్ మైదానాల వేటలో పోలవరం అధికారులు
Polavaram: పోలవరం జిల్లాలో ప్రతి మండలంలో క్రీడా మైదానాల అభివృద్ధికి కలెక్టర్ ఆదేశం. "మా ఊరి మైదానం" కోసం జూలై 1 నుంచి పీడీలు, పీఈటీలతో ప్రత్యేక బృందాల ఏర్పాటు.
Polavaram: జూలై 1 నుంచి స్పెషల్ డ్యూటీస్ మైదానాల వేటలో పోలవరం అధికారులు
పోలవరం: పోలవరం జిల్లాలో "మా ఊరి మైదానం" కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని, ప్రతి మండలంలో ఒక ఎకరానికి పైబడిన ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి క్రీడా మైదానాలుగా అభివృద్ధి చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశించినట్లు డిస్ట్రిక్ట్ ట్రైబల్ స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ కంగల పోతు రాజు తెలిపారు.
జిల్లా పరిధిలోని 12 మండలాల్లో మొత్తం 50 క్రీడా మైదానాలను గుర్తించాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారని, ఇప్పటివరకు పాఠశాల మైదానాలు మినహా 32 స్థలాలను మాత్రమే గుర్తించామని చెప్పారు. మిగిలిన 18 మైదానాలను రెండు వారాల్లోగా గుర్తించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాల్సి ఉన్నందున ప్రతి మండలం నుంచి ఇద్దరు చొప్పున పీడీలు, పీఈటీలను పూర్తి కాలం ఆన్ డ్యూటీపై నియమించనున్నట్లు వెల్లడించారు.
ఈ ప్రత్యేక బాధ్యతలు చేపట్టే అధికారులు ప్రతి గ్రామం, పంచాయతీ, సచివాలయం పరిధిలో పర్యటిస్తూ పాఠశాల స్థలాలను మినహాయించి ప్రభుత్వ, గ్రామకంఠం, బంజరు, పోరంబోకు, అసైన్మెంట్ భూములను పరిశీలించి క్రీడా మైదానాలకు అనువైన స్థలాలను గుర్తించాలని సూచించారు. ఆయా స్థలాల సర్వే నంబర్లు, విస్తీర్ణం, గూగుల్ లొకేషన్, ఫొటోలు, గ్రామం, పంచాయతీ, సచివాలయం, మండలం తదితర వివరాలతో సమగ్ర నివేదిక రూపొందించాలని తెలిపారు.
అదే సమయంలో ప్రతి సచివాలయం స్థాయిలో విలేజ్ స్పోర్ట్స్ అథారిటీలు, మండల, డివిజన్, జిల్లా స్థాయి స్పోర్ట్స్ అథారిటీలు ఏర్పాటు చేయడంతో పాటు వివిధ క్రీడా సంఘాలు, క్లబ్‌లు, టోర్నమెంట్ నిర్వాహకులు, క్రీడాకారులు, క్రీడాభిమానులను గుర్తించి సమన్వయం చేయాలని పేర్కొన్నారు.
"మా ఊరి మైదానం" కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాకుండా గ్రామస్థులందరి భాగస్వామ్యంతో నిరంతరం కొనసాగే ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకోవాలన్నదే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లక్ష్యమని కంగల పోతు రాజు తెలిపారు. గ్రామాల్లో పిల్లలు, యువత నిత్యం క్రీడల్లో పాల్గొనే వాతావరణం కల్పించేందుకు సమర్థులైన, అంకితభావంతో పనిచేసే పీడీలు, పీఈటీలను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగల పీడీలు, పీఈటీల వివరాలను జిల్లా పీడీలు–పీఈటీలు అధ్యక్షుడు *విండెల కృష్ణారావు (9441328312)*కు వెంటనే తెలియజేయాలని కోరారు.
ఎంపికైన వారితో సమావేశం నిర్వహించి తుది జాబితా ఖరారు చేసి ఆన్ డ్యూటీ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు, జూలై 1, 2026 నుంచి ప్రత్యేక బృందాలు విధులు చేపట్టి ప్రతిరోజూ పురోగతి నివేదికలు సమర్పించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. "మా ఊరి మైదానం" విజయవంతం కావాలంటే ప్రజలే యజమానులుగా భావించి ప్రతి గ్రామంలో క్రీడా సంస్కృతిని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు .




