Konaseema: అర్జీదారుల సంతృప్తే సుపరిపాలనకు ప్రమాణం: కలెక్టర్ మహేష్ !

Konaseema: అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవు: కోనసీమ కలెక్టర్ హెచ్చరిక.

PRABHU, RAZOLE
Published on: 29 Jun 2026 5:14 PM IST
Konaseema
X

Konaseema: అర్జీదారుల సంతృప్తే సుపరిపాలనకు ప్రమాణం: కలెక్టర్ మహేష్ !

అమలాపురం: ప్రజల నుంచి అందిన అర్జీలను నాణ్యతతో, జవాబుదారీతనంతో పరిష్కరించి, ప్రతి అర్జీదారుడు పూర్తిగా సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్.బిఆర్. అంబేడ్కర్.కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు.

సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో సుమారు 220 అర్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియాదేవి, డీఆర్వో వి. సుబ్బారావు, ఎస్‌డీసీ అచ్చుత కుమారి ప్రజల నుంచి స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావు లేదన్నారు. ప్రజల సంతృప్తే అధికారుల పనితీరుకు అసలైన గీటురాయని, సేవల నాణ్యతే సుపరిపాలనకు ప్రమాణమని పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం లేదా బాధ్యతారాహిత్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా పరిష్కరించడంతో పాటు, ఫిర్యాదు పరిష్కారం అనంతరం సంబంధిత అధికారులు స్వయంగా అర్జీదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని సూచించారు.

ఒకసారి పరిష్కరించిన సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియాదేవి మాట్లాడుతూ, పీజీఆర్ఎస్‌తో పాటు ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని మానవీయ దృక్పథంతో పరిష్కరించాలని సూచించారు.

అధికారులు, ఉద్యోగులు సాఫ్ట్ స్కిల్స్ అలవర్చుకుని ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story