Polavaram: అన్ని శాఖల సమన్వయం, ప్రజల సహకారంతో తుఫాన్‌ను ఎదుర్కొన్నాం: ఎస్పీ
Polavaram: పోలీసు, ఇతర శాఖల సమన్వయం, ప్రజల సహకారంతో పోలవరం జిల్లాలో అర్నబ్ తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొన్నామని జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి తెలిపారు.
Polavaram: అన్ని శాఖల సమన్వయం, ప్రజల సహకారంతో తుఫాన్‌ను ఎదుర్కొన్నాం: ఎస్పీ
Polavaram: అర్నబ్ తుఫాను ప్రభావాన్ని పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, విద్యుత్ తదితర శాఖల సమన్వయంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని పోలవరం జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి తెలిపారు. ప్రజల సహకారం, వివిధ శాఖల అధికారుల సమష్టి కృషి వల్ల జిల్లాలో ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా తుఫాను పరిస్థితులను అధిగమించగలిగామని పేర్కొన్నారు.
శుక్రవారం రాత్రి రంపచోడవరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కె. దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్‌లతో కలిసి నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. తుఫాను కదలికలు, వర్షపాతం, ప్రభావ తీవ్రతపై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారని తెలిపారు. రాష్ట్ర డీజీపీ కూడా నిరంతరం టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ జిల్లాల పరిస్థితులను సమీక్షించారని, అవసరమైన పోలీసు బలగాలు, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ సహాయం తదితర అంశాలపై మార్గనిర్దేశం చేశారని వివరించారు.
చెట్లు పడిన వెంటనే తొలగింపు.. ప్రమాదాల నివారణకు చర్యలు
తుఫానుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడటం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఈ నేపథ్యంలో రోడ్లపై చెట్లు పడిన వెంటనే ఆర్ అండ్ బీ, సంబంధిత శాఖల సిబ్బంది స్పందించి తొలగింపు చర్యలు చేపట్టారని చెప్పారు. సమాచారం అందిన కొద్దిసేపటికే అధికారులు సంఘటనా స్థలాలకు చేరుకునేలోపే చాలా ప్రాంతాల్లో రహదారులపై పడిన చెట్లను తొలగించారని, తాను క్షేత్రస్థాయికి చేరుకునే సమయానికి సుమారు 70 నుంచి 80 శాతం రహదారుల క్లియరెన్స్ పూర్తయి ఉండేదని పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్‌లకు సమాచారం అందిన వెంటనే ప్రత్యేక బృందాలు స్పందించడం వల్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చూడగలిగామని తెలిపారు.
ఘాట్ రోడ్లు, వాగుల వద్ద పోలీసు నిఘా
తుఫాను సమయంలో ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు శాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని ఎస్పీ తెలిపారు. ప్రమాదకరమైన ఘాట్ రోడ్లలో ప్రయాణాలు చేయవద్దని సూచించినప్పుడు ప్రజలు సహకరించారని, భారీ వాహనాలను అవసరమైన ప్రాంతాల్లో నిలిపివేసినా ఎలాంటి ఇబ్బందులు సృష్టించకుండా పోలీసుల సూచనలు పాటించారని వివరించారు.
పోలవరం జిల్లాలో వాగులు, వంకలు అధికంగా ఉన్నందున వర్షాల సమయంలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగి రహదారులపైకి వస్తుందని తెలిపారు. అలవాటైన మార్గాలే కదా అనే నిర్లక్ష్యంతో ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నిస్తే నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు వాగులు, వంకలు, రహదారులు తెగిపోయిన ప్రాంతాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలను నియంత్రించామని తెలిపారు. అధికారులు సూచించిన భద్రతా చర్యలకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడగలిగామని పేర్కొన్నారు.
అన్ని శాఖల సమన్వయం, పోలీసు సిబ్బంది అప్రమత్తత, ప్రజల సహకారం వల్ల అర్నబ్ తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు, పాత్రికేయ మిత్రులకు పోలీసు శాఖ తరఫున పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.




