Gopalapuram: తాళం వేసిన జ్ఞాన మందిరం... గోపాలపురం గ్రంథాలయం దుస్థితి
Gopalapuram: పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం శాఖ గ్రంథాలయం సిబ్బంది కొరత కారణంగా వారంలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకుంటోంది.
Gopalapuram: ఒకప్పుడు విద్యార్థులు, నిరుద్యోగులు, పుస్తక ప్రియులతో కిటకిటలాడిన గోపాలపురం శాఖ గ్రంథాలయం నేడు తాళం వేసిన భవనంగా మారింది. చరిత్ర కలిగిన ఈ గ్రంథాలయం ప్రస్తుతం వారంలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకోవడంతో పాఠకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రంథాలయ పాలకుడు బదిలీపై వెళ్లిన తరువాత ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టినా, సిబ్బంది కొరత కారణంగా గ్రంథాలయం సాధారణ రోజుల్లో అందుబాటులో ఉండడం లేదు.
గతంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా పనిచేసిన పోతుల రామతిరుపతిరెడ్డి ప్రత్యేక చొరవతో కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం, పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు సమకూరాయి. దీంతో ఈ గ్రంథాలయం గ్రామ యువతకు జ్ఞాన కేంద్రంగా మారి, అనేక మంది ఉన్నత ఉద్యోగాలు సాధించేందుకు తోడ్పడింది.
అయితే ప్రస్తుతం ఉదయం పత్రికలు చదవడానికి వచ్చిన వారికి కూడా తాళం వేసిన తలుపులే కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, నిరుద్యోగులు గ్రంథాలయం మూసివేతతో నిరాశ చెందుతున్నారు. లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ గ్రంథాలయం నేడు వినియోగానికి దూరమవడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై లైబ్రేరియన్ సత్యనారాయణ మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుతం ప్రతి మంగళవారం మాత్రమే గ్రంథాలయం తెరుస్తున్నామని తెలిపారు. కనీసం వారంలో మూడు రోజులు నిర్వహించేలా అనుమతి కోరామని, త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
జ్ఞానాన్ని పంచాల్సిన గ్రంథాలయం తాళం వెనుక బందీ కావడం పట్ల పాఠకులు ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే పూర్తి స్థాయిలో సేవలు పునరుద్ధరించాలని అధికారులను కోరుతున్నారు.




