Bhimavaram: మావుళ్లమ్మ గుడి రోడ్డులో పునరావృతమవుతున్న ట్రాఫిక్ నరకం!
Bhimavaram: భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయ సమీపంలో రోడ్డు ఆక్రమించి నిర్వహిస్తున్న హోల్‌సేల్ పండ్ల వ్యాపారంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.
Bhimavaram: మావుళ్లమ్మ గుడి రోడ్డులో పునరావృతమవుతున్న ట్రాఫిక్ నరకం!
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవాలయ ప్రాంగణ రోడ్డులో హోల్సేల్ పండ్ల వ్యాపారుల అక్రమ విక్రయాలు మళ్లీ మొదటికి వచ్చాయి. వ్యాపారులు రోడ్డును ఆక్రమించి యథేచ్ఛగా వ్యాపారాలు చేస్తుండటంతో స్థానిక ప్రజలు, అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఇటీవల ఈ సమస్యపై హెచ్‌ఎమ్‌టీవీ (hmtv) కథనాలను ప్రసారం చేయడంతో పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. అక్రమంగా రోడ్లపై వ్యాపారాలు నిర్వహిస్తున్న పండ్ల వ్యాపారులను పిలిపించి, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల హెచ్చరికలతో రెండు రోజుల పాటు రోడ్డు స్పష్టంగా కనిపించినప్పటికీ, ఆ తర్వాత పరిస్థితి మళ్లీ పాత చుట్టే అయింది.
పోలీసుల పర్యవేక్షణ తగ్గడంతో వ్యాపారులు తిరిగి తమ వ్యాపారం హోల్సేల్ పండ్ల లోడుతో వచ్చే వాహనాలు, వ్యాపార లావాదేవీల వల్ల రోడ్డంతా క్రిక్కిరిసిపోతోంది. దీనివల్ల నిత్యం వేలాదిగా వచ్చే భక్తుల వాహనాలతో పాటు, అత్యవసర వాహనాలు కూడా ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది.
అధికారులు తాత్కాలిక హెచ్చరికలతో సరిపెట్టకుండా, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భక్తులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అమ్మవారి ఆలయ సమీపంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి శాశ్వతంగా పోలీసులను ఏర్పాటు చేయాలని, రోడ్డు ఆక్రమణదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.




