Penugonda: పెనుగొండలో ఘనంగా యోగా దినోత్సవం పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే!
Penugonda: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు.
Penugonda: పెనుగొండలో ఘనంగా యోగా దినోత్సవం పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే!
పెనుగొండ: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని వాసవి పెనుగొండ గ్రామంలో ఆదివారం ప్రత్యేక యోగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు పాల్గొని యోగాసనాలు, ప్రాణాయామాలు అభ్యసించారు.
కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ దాసిరాజు ముఖ్య అతిథులుగా హాజరై యోగ సాధనలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా శరీరం, మనస్సు, ఆత్మల మధ్య సమతుల్యతను పెంపొందించే భారతీయ జీవన విధానమని పేర్కొన్నారు.
ప్రస్తుత జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిళ్లు, అనారోగ్య సమస్యలను అధిగమించడానికి యోగ ఉత్తమ మార్గమని కలెక్టర్ నాగరాణి తెలిపారు. యోగ సాధన ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం యోగకు కేటాయించాలని సూచించారు.
యోగ గురువుల ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ యోగాసనాలు, ప్రాణాయామ విధానాల్లో అంగన్వాడి సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది,మహిళలు, యువత, విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.“ప్రతి రోజు యోగ – ప్రతి ఇంట ఆరోగ్యం”, “యోగతోనే సంపూర్ణ ఆరోగ్యం” వంటి నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.




