Tanuku: ఎమ్మెల్యే ఆరిమిల్లికి కారుమూరి ఓపెన్ ఛాలెంజ్!

Tanuku: కూటమి ప్రభుత్వం, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణపై మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 Jun 2026 1:56 PM IST
Tanuku
X

Tanuku: ఎమ్మెల్యే ఆరిమిల్లికి కారుమూరి ఓపెన్ ఛాలెంజ్!

తణుకు: కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు. తనపై రూ.800 కోట్ల టిడిఆర్ బాండ్ల కుంభకోణం పేరుతో తప్పుడు ప్రచారం చేసి మంత్రి పదవి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు.

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివేదికలు పరిశీలించి వాస్తవాలు తెలుసుకుని తనకు మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను లక్ష్యంగా చేసుకుని "అబద్ధాల మిల్లి" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు తణుకులో 157 ఎకరాల భూమి ఉందన్న ఆరోపణలు నిరూపిస్తే రెండు ఎకరాలు తనకు ఇచ్చి, మిగతా భూమిని పేదలకు పంచాలని సవాల్ విసిరారు.

తణుకు జర్నలిస్టులకు కూడా ఐదు సెంట్ల చొప్పున స్థలాలు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. వేల్పూర్ గ్రామం లో రానున్న మూడు సంవత్సరాలలో 10 ఎకరాలు భూమి కొన్ని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తే నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను అంటూ కారుమూరి అరిమిల్లి కీ సవాల్ విసిరారు.

తాను వేల కోట్లు దోచుకున్నానన్న ఆరోపణలు అవాస్తవమని, అంత డబ్బు దాచాలంటే ఎన్ని కంటైనర్లు కావాలో చెప్పాలని ఎద్దేవా చేశారు. ట్రాన్స్‌పోర్ట్ వ్యవహారంపై విచారణల్లో నిజాలు బయటపడ్డాయని, ప్రచారం చేసినట్లు భారీ మొత్తాలు కాకుండా కేవలం రూ.9 కోట్ల వ్యవహారమేనని పేర్కొన్నారు.

ఆరిమిల్లి చుట్టూ క్రికెట్ బెట్టింగ్, గంజాయి, పేకాట ముఠాలకు చెందిన వ్యక్తులు ఉన్నారని ఆరోపించారు. వేల్పూర్ గ్రామ అభివృద్ధికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, అయినా ఎమ్మెల్యే స్వగ్రామంలో ప్రజల కోసం భూమి కొనలేదని విమర్శించారు.

వేల్పూర్‌లో ఆస్పత్రి, సబ్‌స్టేషన్ వంటి అభివృద్ధి కార్యక్రమాలను తానే తీసుకువచ్చానని తెలిపారు. తణుకులో భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

తేతలి పంచాయతీలో ఆదాయ వనరుల నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పంచాయతీ వ్యవహారాల్లో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని అధికారులను ప్రభావితం చేస్తున్నారని విమర్శించారు. తేతలి పరిధిలోని లేహం ఫ్యాక్టరీకి పన్ను రాయితీలు ఇవ్వడంపై ప్రశ్నలు లేవనెత్తారు.

తన హయాంలో ఫ్యాక్టరీలో జంతువుల వధను అడ్డుకున్నానని, ప్రస్తుతం జరుగుతున్న వాటికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. వైజాగ్‌లో పట్టుబడిన కంటైనర్ వ్యవహారం మూలాలు తణుకుతో సంబంధం ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవసరమైతే తిహార్ జైలుకెళ్లడానికైనా సిద్ధమని వ్యాఖ్యానించారు. వైసీపీ నిర్వహించిన "వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమం విజయవంతం కావడంతో తట్టుకోలేకనే తమపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న 38 మందిపై కేసులు నమోదు చేశారని మండిపడ్డారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story