Narasapuram: కొప్పర్రులో రూ.35 లక్షలతో స్వర్గవాటికగా శ్మశాన వాటిక

Narasapuram: నరసాపురం మండలం కొప్పర్రులో రూ.35 లక్షల సొంత నిధులతో నిర్మించిన ఆధునిక హిందూ శ్మశాన వాటికను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM
Published on: 11 Oct 2026 6:02 PM IST
Narasapuram
X

Narasapuram: కొప్పర్రులో రూ.35 లక్షలతో స్వర్గవాటికగా శ్మశాన వాటిక

Narasapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పర్రు గ్రామంలో హిందూ శ్మశాన వాటికను రూ.35 లక్షలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గ్రామవాసి పోలిశెట్టి శ్రీనివాస్ సొంత నిధులతో శ్మశాన వాటికను అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిచారు.

అభివృద్ధి చేసిన శ్మశాన వాటికను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జ్ పొత్తూరి రామరాజు, టీడీపీ సీనియర్ నాయకులు కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. గతంలో మోకాళ్ల లోతు బురదమట్టి, ముళ్లపొదలతో నిండిపోయి, కనీస సౌకర్యాలు లేక ఇబ్బందికరంగా ఉన్న శ్మశాన వాటిక దుస్థితిని చూసి శ్రీనివాస్ చలించిపోయారు.

మనిషికి చివరి వీడ్కోలు గౌరవప్రదంగా ఉండాలనే సంకల్పంతో రూ.35 లక్షలు వెచ్చించి అభివృద్ధి చేశారు. శ్మశాన వాటికను పార్కును తలపించేలా అందంగా తీర్చిదిద్ది గ్రామంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

మణికర్ణిక దహన వాటిక, యోగేశ్వరస్వామి విగ్రహం, అందమైన ముఖద్వారం, షెడ్డు, నీటి పైపులు, ముక్తి స్నాన ఘట్టం, పార్కు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. దీంతో గతంలో దుర్భరంగా ఉన్న శ్మశాన వాటిక నేడు ఆహ్లాదకరమైన వాతావరణంతో ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ.. శ్మశాన వాటిక దుస్థితిని చూసి స్పందించి, సొంత నిధులతో ఇంతటి అభివృద్ధి చేసిన పోలిశెట్టి శ్రీనివాస్ సేవలు అభినందనీయమని కొనియాడారు. గ్రామాభివృద్ధికి ఆయన అందించిన సహకారం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. కొప్పర్రు గ్రామానికి ఉపకారిగా నిలిచిన శ్రీనివాస్‌ను గ్రామస్తులు అభినందిస్తున్నారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM

POTHUMUDI MUTYALU, NARASAPURAM