Tanuku: స్థానిక ఎన్నికల్లో కూటమి అరాచకాలను నిరసిస్తూ తణుకులో వామపక్షాల ధర్నా
Tanuku: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అరాచకాలు, పోలీసుల తీరును నిరసిస్తూ తణుకు నరేంద్ర సెంటర్‌లో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Tanuku: స్థానిక ఎన్నికల్లో కూటమి అరాచకాలను నిరసిస్తూ తణుకులో వామపక్షాల ధర్నా
తణుకు: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలు, పోలీసుల అరాచకాలు, ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న తీరును నిరసిస్తూ వామపక్ష పార్టీల రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం తణుకు నరేంద్ర సెంటర్‌లో సీపీఎం,సీపీఐ ఆధ్వర్యంలో నిరసన, ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లను అనుమతించకపోవడం, కౌంటింగ్ ఏజెంట్లకు సైతం అవకాశం కల్పించకుండా అడ్డంకులు సృష్టించడం వంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తున్నాయని విమర్శించారు.
అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తూ ప్రతిపక్షాలపై దౌర్జన్యాలకు పాల్పడటం, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా అధికార పార్టీకి కొమ్ముకాయడం దుర్మార్గమన్నారు. ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకుంటున్న అక్రమాలు, అధికార దుర్వినియోగంపై ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించి స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సీపీఎం తణుకు పట్టణ కార్యదర్శి అడ్డగర్ల అజయకుమారి, సీపీఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, సీపీఐ తణుకు ఏరియా కార్యదర్శి సికిలే పుష్పకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఖండించారు. ప్రతిపక్షాల ఎన్నికల హక్కులను కాలరాయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కామన మునిస్వామి, గార రంగారావు, బొద్దాని మురళీ, బండి సత్యనారాయణ, కోరాడ సుధీర్ బాబు, జి. గోపి, పి. దక్షిణామూర్తి, పి.ఎల్. నరశింహారావు, శివకుమార్, నాగలక్ష్మి, ఎం. రమేష్ తదితరులు పాల్గొన్నారు.




