Tanuku: తణుకులో శీలం వీరన్న మృతిపై కేసు నమోదు!
Tanuku: పశ్చిమగోదావరి జిల్లా తణుకు అమర్ వైన్స్ వద్ద అనుమానాస్పద స్థితిలో శీలం వీరన్న (55) సజీవ దహనం. భీమవరం నుంచి క్లూస్ టీమ్ సీఐ రాజేష్ బృందం వచ్చి ఆధారాలు సేకరణ.
Tanuku: తణుకులో శీలం వీరన్న మృతిపై కేసు నమోదు!
Tanuku: తణుకు పట్టణ పరిధి అమర్ వైన్స్ వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో శీలం వీరన్న (55) అనుమానాస్పద స్థితిలో సజీవ దహనమయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం భీమవరం నుంచి వేలిముద్రల నిపుణులు వచ్చి సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించి కీలక ఆధారాలను సేకరించారు.
పోలీసుల కథనం ప్రకారం..శీలం వీరన్న (55)కు అమర్ వైన్స్‌లో నైట్ పాయింట్ నిర్వహించే వ్యక్తితో పరిచయం ఉంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి నైట్ పాయింట్ ముగిసే వరకు వీరన్న అక్కడే ఉన్నాడు. అనంతరం మద్యం దుకాణం వెనుక ఉన్న గదిలోకి వెళ్లి తాళం వేసుకుని నిద్రించినట్లు పోలీసులు తెలిపారు.
తుఫాను కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గదిలో కొవ్వొత్తి వెలిగించుకున్నట్లు తెలుస్తోంది. ఆ గదిలో అట్టలు, మద్యం సీసాలు ఉండటంతో కొవ్వొత్తి నుంచి మంటలు వ్యాపించి అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భీమవరం క్లూస్ టీం సీఐ రాజేష్ ఆధ్వర్యంలో నిపుణులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి పలు ఆధారాలను సేకరించారు.
ఘటన ప్రాంతంలో వ్యక్తి కొవ్వొత్తి వెలిగించడం ద్వారా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందా..? ఎవరైనా నిప్పంటించి సజీవ దహనం చేశారనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటనపై ఇప్పటికే తణుకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




