Nidadavolu: రోడ్డు ప్రమాదం చూసి కాన్వాయ్ ఆపిన మంత్రి.. డ్రైవర్లకు కందుల దుర్గేష్ హితవు
Nidadavolu: తాడిపర్రు వెళ్తుండగా పొలాల్లోకి దూసుకెళ్లిన లారీని గమనించిన మంత్రి కందుల దుర్గేష్. కాన్వాయ్ ఆపి సహాయక చర్యలు పర్యవేక్షణ, డ్రైవర్లు సురక్షితం.
Nidadavolu: రోడ్డు ప్రమాదం చూసి కాన్వాయ్ ఆపిన మంత్రి.. డ్రైవర్లకు కందుల దుర్గేష్ హితవు
నిడదవోలు: గురువారం తెల్లవారుజామున నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని తాడిపర్రు గ్రామంలో పర్యటించేందుకు మంత్రి కందుల దుర్గేష్ వెళ్తుండగా తాడిపర్రు - ఉండ్రాజవరం మధ్య ఒక లారీ అదుపుతప్పి సమీపంలోని పంటచేల్లోకి దూసుకెళ్లిన ప్రమాదాన్ని గమనించారు. వెంటనే మంత్రి కందుల దుర్గేష్ తన కాన్వాయ్‌ను నిలిపివేసి, స్వయంగా ప్రమాద స్థలానికి చేరుకున్నారు.
అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షించి, స్థానికులను అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో మరియు డ్రైవర్ సురక్షితంగా ఉండటంతో మంత్రి దుర్గేష్ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సందర్భంగా వాహన చోదకులకు మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ..డ్రైవింగ్ చేసే సమయంలో డ్రైవర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఒక్క క్షణం నిద్రమత్తు లేదా అజాగ్రత్త పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది.ఇంట్లో మన కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుంటారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
మద్యం సేవించి గానీ, నిద్రమత్తులో గానీ వాహనాలను నడపడం వల్ల ఎన్నో కుటుంబాల్లో తీరని శోకం మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ, "నిదానమే ప్రదానం" అనే సూత్రాన్ని అలవర్చుకుని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.




