Nidadavolu: ఓటర్ల సవరణ ‘సర్’ పోస్టర్, ‘వీబీ జీరాంజీ’ బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి

Nidadavolu: తాడిపర్రులో ఓటర్ల సమగ్ర సవరణ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్. వీబీ జీరాంజీ ద్వారా ఉపాధి హామీ పనిదినాలు 125 రోజులకు పెంపు.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE
Published on: 2 July 2026 9:26 PM IST
Nidadavolu
X

Nidadavolu: ఓటర్ల సవరణ ‘సర్’ పోస్టర్, ‘వీబీ జీరాంజీ’ బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి

నిడదవోలు: సమగ్ర ఓటర్ల జాబితా రూపకల్పనే ‘సర్’ లక్ష్యం అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం తాడిపర్రు పర్యటనలో భాగంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-2026) అవగాహన పోస్టర్‌తో పాటు, ఉపాధి హామీ రోజులను 125 రోజులకు పెంచుతూ రూపొందించిన నూతన బ్రోచర్‌ను ఆయన స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ ఈ ‘సర్’ (Special Intensive Revision) కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఓటు అనేది పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ఓటు లేకపోతే పౌరుడిగా జీవించి ఉన్నట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, జాబితాలో తప్పుల సవరణకు ఈ కార్యక్రమం ఒక గొప్ప వేదిక అని పేర్కొన్నారు.

ఓటర్ల జాబితాపై ఎలాంటి అపోహలు, అనవసర ఆందోళనలు పెట్టుకోవద్దని, మన ఓటు భద్రత కోసమే ఈ ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. జులై 14వ తేదీతో ఈ సమగ్ర సవరణ ప్రక్రియ ముగుస్తుందని వెల్లడించిన మంత్రి.. పాత ఫోటోల స్థానంలో కొత్త ఫోటోలను సమర్పించాలని, బూత్ లెవెల్ అధికారులకు (BLO) ప్రజలంతా పూర్తి సమాచారం అందించి సహకరించాలని పిలుపునిచ్చారు.

*‘వీబీ జీరాంజీ’ చట్టంతో గ్రామీణ జీవనోపాధి బలోపేతం:మంత్రి దుర్గేష్*

భారతదేశాన్ని ‘వికసిత్ భారత్’గా మార్చే సంకల్పంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన "వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్, అజీవికా మిషన్ - గ్రామీణ చట్టం" (VB-GRAMJI / వీబీ జీరాంజీ) గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు, ఆర్థిక పురోగతికి ఎంతగానో తోడ్పడుతుందని మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. ఈ నూతన చట్టం ద్వారా ఉపాధి హామీ పనిదినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం జరిగిందన్నారు.ఈ నూతన విధానం వల్ల నిరుపేదలకు ఆర్థికంగా గరిష్ట లబ్ధి చేకూరడమే కాకుండా, గ్రామీణ జీవనోపాధి మరింత బలోపేతం అవుతుందన్నారు.

ఈ బ్రోచర్‌లో నిరుద్యోగ భృతి కోసం మెరుగైన ఏర్పాట్లు, సమయానికి కూలీ చెల్లింపులు, ఒకవేళ చెల్లింపులు ఆలస్యమైతే పరిహారం అందించడం మరియు గ్రామసభల ద్వారా ‘వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక’ రూపకల్పన వంటి అనేక ప్రజాపయోగకర అంశాలు ఉన్నాయని మంత్రి వివరించారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సేవలను శ్లాఘిస్తూ.. "కూటమి ప్రభుత్వం జిందాబాద్", "కూటమి ప్రభుత్వం, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ నాయకత్వం వర్ధిల్లాలి" అంటూ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE

Next Story