Nidadavolu: తాడిపర్రు పీఏసీఎస్ రాష్ట్రానికే ఆదర్శం.. మంత్రి కందుల దుర్గేష్

Nidadavolu: తాడిపర్రులో రూ.70 లక్షల పీఏసీఎస్ భవనానికి మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన. గ్రామాభివృద్ధికి రూ.3.84 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడి.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE
Published on: 2 July 2026 8:40 PM IST
Nidadavolu
X

Nidadavolu: తాడిపర్రు పీఏసీఎస్ రాష్ట్రానికే ఆదర్శం.. మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు: తాడిపర్రు పీఏసీఎస్ రాష్ట్రంలోని అన్ని సొసైటీలకు ఆదర్శవంతంగా నిలిచిందని మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన ప్రత్యేక పూజల అనంతరం రూ.70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) నూతన ఆర్ సీసీ రూప్ బిల్డింగ్ కు మంత్రి దుర్గేష్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. అన్ని విషయాల్లో ప్రభుత్వంపైనే ఆధారపడకుండా.. సొసైటీ సొంత నిధులు, రైతులకు డివిడెంట్ రూపంలో వచ్చే నిధులు, కోడూరి వెంకటేశ్వర్ రావు అందించిన రూ.10 లక్షల విరాళంతో పాటు సభ్యుల సహకారాన్ని కూడగట్టి ఈ భవన నిర్మాణానికి పూనుకోవడం గ్రామ ప్రజల ఐక్యతకు నిదర్శనమన్నారు. ఈ నూతన భవనంలో క్రింది భాగంలో అత్యాధునిక గోడౌన్, పై అంతస్తులో కార్యాలయం నిర్మిస్తున్నారని, ఇది రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

*తాడిపర్రు గ్రామాభివృద్ధికి రూ.3.84 కోట్లు:మంత్రి దుర్గేష్*

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దూరదృష్టి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాతుర్యం వల్ల గత రెండేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వం తాడిపర్రు గ్రామ అభివృద్ధికి రూ.3.84 కోట్లు మంజూరు చేసిందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ప్రధానంగా పల్లె పండుగ-1 ద్వారా రూ.12 లక్షల వ్యయంతో 2 పనులు, పల్లె పండుగ-2 ద్వారా రూ.42 లక్షల వ్యయంతో 9 పనులు చేపట్టామన్నారు. అదే విధంగా రూ.33.60 లక్షలు పంచాయతీ నిధులు, రూ.2.24 కోట్లతో ఇంటింటికీ తాగునీటి సరఫరా అందించేందుకు జల్ జీవన్ మిషన్ పనులు, రూ.7 లక్షల మండల ప్రజా పరిషత్ నిధులు, 5 గోకులం షెడ్ల నిర్మాణానికి రూ.10.35 లక్షలు, తాడిపర్రు మీదుగా వడ్లూరు - తీపర్రు వెళ్లే ఆర్ అండ్ బీ రహదారి కోసం ప్రత్యేకంగా రూ.50 లక్షలు మంజూరు చేసి గ్రామాభివృద్ధికి బాటలు వేశామన్నారు.

రెండేళ్లలో 11 మంది లబ్ధిదారులకు రూ.4.64 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో కేంద్ర ప్రభుత్వం నుండి రూ.28 కోట్ల శాస్కి నిధులను రాబట్టడం జరిగిందని, అందులో సింహభాగం రూ.15 కోట్లను ఒక్క ఉండ్రాజవరం మండలానికే కేటాయించామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, అత్యంత నాణ్యమైన రహదారులను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మిగిలిన పుంత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ఇతర నిధుల నుండి త్వరితగతిన ఏర్పాట్లు చేస్తామన్నారు.

త్వరలోనే అర్హులైన వారందరికీ నూతన పెన్షన్లను అందిస్తామని, గృహ నిర్మాణాలను వేగవంతం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. తాము నడుపుతోంది ప్రజలు మెచ్చిన "ప్రజా ప్రభుత్వం" అని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పాలన సాగుతుందని పునరుద్ఘాటించారు. విజయవాడలో అత్యవసర పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పటికీ, దైవానుగ్రహంతో ఈ పవిత్ర శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అంతకుముందు స్థానిక శివాలయాన్ని సందర్శించిన మంత్రి దుర్గేష్ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE

Next Story