Nidadavole: నిడదవోలులో మహాత్మా గాంధీకి మంత్రి దుర్గేష్ నివాళులు!
Nidadavole: గాంధీ జయంతి వేళ నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ ఘన నివాళులు ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ ప్రతిజ్ఞ పారిశుద్ధ్య కార్మికులు, విద్యార్థులకు బహుమతుల ప్రదానం.
Nidadavole: నిడదవోలులో మహాత్మా గాంధీకి మంత్రి దుర్గేష్ నివాళులు!
నిడదవోలు: పరాయి పాలనలో మగ్గుతున్న భారతమాత దాస్య శృంఖలాలను తెంచడానికి సత్యాగ్రహం అనే అహింసాస్త్రంతో స్వరాజ్యం సాధించిపెట్టిన మహానుభావుడు, శాంతియుత సమాజ స్థాపన కోసం తపించిన జాతిపిత మహాత్మా గాంధీ అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నిడదవోలు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' సంకల్పంతో బాపూజీ జయంతి వేడుకలను నిర్వహించారు. పట్టణ ప్రజలు, అధికారులతో కలిసి మంత్రి దుర్గేష్ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా "పరిసరాల పరిశుభ్రతకు ప్రతిరోజూ కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సంకల్పానికి కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
పరిశుభ్రత దిశగా నేను వేస్తున్న ఈ ముందడుగు మన రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో తోడ్పడుతుంది. నేటి నుండి తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సుభిక్షమైన, ఆనందకరమైన రాష్ట్రాన్ని అందించేందుకు నా వంతు కృషి చేస్తాను." అని మంత్రి స్వయంగా ప్రతిజ్ఞను చదివి వినిపించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత, సేవా స్ఫూర్తితో మహాత్మా గాంధీ చూపిన మార్గం తరతరాలకు ఆదర్శప్రాయం, స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. పరిశుభ్రతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించి, బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని, పరిశుభ్ర సమాజాన్ని సాధించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నిడదవోలు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' అంశంపై నిర్వహించిన పోటీలలో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు, అలాగే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మున్సిపల్ సిబ్బందికి,పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి దుర్గేష్ మెమెంటోలు అందజేసి ఘనంగా సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా "జోహార్ మహాత్మా గాంధీ" నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది.




