Nidadavole: హామీలకే పరిమితమైన ఆటోనగర్ నిడదవోలు వర్కర్ల దశాబ్దాల పోరాటం!

Nidadavole: ఒకప్పటి 'చిన్న కోయంబత్తూరు' నిడదవోలులో ఆటోనగర్ ఏర్పాటుకై 150 కుటుంబాల ఎదురుచూపు. హామీలకే పరిమితమైన పాలకుల తీరుపై వర్కర్ల ఆవేదన.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE
Published on: 13 Aug 2026 12:10 PM IST
Nidadavole
X

Nidadavole: హామీలకే పరిమితమైన ఆటోనగర్ నిడదవోలు వర్కర్ల దశాబ్దాల పోరాటం!

Nidadavole: ఒకప్పుడు లారీ బాడీ, క్యాబిన్ నిర్మాణం నుంచి ఆయిల్ ఇంజన్ మరమ్మతులు, ఫౌండ్రీ పనుల వరకు ఏ పని కావాలన్నా నిడదవోలుకే రావాల్సిందే. పారిశ్రామిక రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిడదవోలును అప్పట్లో **“చిన్న కోయంబత్తూరు”**గా కూడా పిలిచేవారు. అయితే పాలకుల నుంచి సరైన ప్రోత్సాహం, మౌలిక సదుపాయాలు అందకపోవడంతో ఈ రంగంపై ఆధారపడిన కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది.

నిడదవోలు అభివృద్ధిలో ఆటో వర్కర్స్, మెకానిక్‌లు, ఫౌండ్రీ కార్మికుల పాత్ర ఎంతో కీలకం. శ్రీరామ ఫౌండ్రీ, శ్రీ వీరభద్ర ఫౌండ్రీ, మాధవ ఇండస్ట్రీస్, సూర్య ఇంజనీరింగ్ వంటి సంస్థలు నిడదవోలు పారిశ్రామిక రంగానికి ఒకప్పుడు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. రైస్ మిల్లులకు అవసరమైన రబ్బర్ షట్టర్లు, పేపర్ మౌల్డింగ్ మెషిన్లు, ఆయిల్ ఇంజన్ మరమ్మతులు, లారీ బాడీ–క్యాబిన్ నిర్మాణం వంటి పనుల కోసం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు నిడదవోలుకు వచ్చేవారు.

కానీ కాలక్రమేణా పరిస్థితులు మారాయి. సరైన స్థలం, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో ఈ వృత్తులపై ఆధారపడిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం సుమారు 150 కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని ఆటో వర్కర్స్ చెబుతున్నారు.

*ఎన్నో ఏళ్లుగా అదే హామీ...*

నిడదవోలులో ఆటోనగర్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ కొత్తది కాదు.* 2008లో అప్పటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఆటోనగర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆటో వర్కర్స్ గుర్తుచేస్తున్నారు.

అదేవిధంగా నిడదవోలు పురపాలక సంఘం అప్పటి *చైర్మన్ బొబ్బ కృష్ణమూర్తి* హయాంలో ఆటోనగర్ ఏర్పాటుకు తీర్మానం కూడా జరిగినట్లు వారు పేర్కొంటున్నారు.

తరువాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనూ ఆటోనగర్ కోసం అప్పటి ఎమ్మెల్యే ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కందుల దుర్గేష్ కూడా ఆటోనగర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, అయితే రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు పనులు ముందుకు సాగలేదని వారు అంటున్నారు.

“ కోట సత్తెమ్మ మోటర్ వర్కర్స్ అసోసియేషన్” పేరుతో ఆటో వర్కర్స్ సంఘం 1989లోనే రిజిస్టర్ అయింది* . దశాబ్దాలుగా తమ సమస్యల కోసం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ, ఆటోనగర్ సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోలేదని సంఘం ప్రతినిధులు చెబుతున్నారు.

*హామీ కాదు... కార్యాచరణ కావాలి*

ఆటో వర్కర్స్‌కు ప్రత్యేకంగా స్థలం కేటాయించి, రోడ్లు, విద్యుత్, నీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలతో ఆటోనగర్‌ను ఏర్పాటు చేస్తే నిడదవోలు పారిశ్రామిక రంగానికి మళ్లీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందని కార్మికులు అభిప్రాయపడుతున్నారు.

ఇది కేవలం కొంతమంది మెకానిక్‌ల సమస్య కాదు. సుమారు 150 కుటుంబాల జీవనోపాధికి సంబంధించిన అంశం. ఒకప్పుడు నిడదవోలు పేరును రాష్ట్రవ్యాప్తంగా చాటిన ఈ వృత్తులు కనుమరుగయ్యేలోపు ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు.

ఇప్పటికైనా పాలకులు హామీలకు పరిమితం కాకుండా ఆటోనగర్ ఏర్పాటుకు స్థలం గుర్తించి, నిధులు కేటాయించి, పనులు ప్రారంభించాలని కోట సర్ తిమ్మ మోటర్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

“ నిడదవోలు పారిశ్రామిక చరిత్రను కాపాడాలి... ఆటో వర్కర్ల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి” అన్నది వారి ప్రధాన డిమాండ్.*

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE

Next Story