Nidadavolu: జాతీయ స్థాయిలో నిడదవోలు విజన్ మోడల్‌కు గుర్తింపు
Nidadavolu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా నిడదవోలు విజన్ యాక్షన్ ప్లాన్ జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందడం గర్వకారణమన్న మంత్రి కందుల దుర్గేష్.
Nidadavolu: జాతీయ స్థాయిలో నిడదవోలు విజన్ మోడల్‌కు గుర్తింపు
నిడదవోలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'స్వర్ణాంధ్ర 2047' లక్ష్య సాధనలో భాగంగా రూపొందించిన నియోజకవర్గ స్థాయి పరిపాలనా నమూనా (SCVAPU) జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవడం పట్ల రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు.
నిడదవోలు నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలు సాధిస్తూ, దేశానికే ఒక నమూనాగా నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ ఎస్. మహేంద్ర దేవ్ ప్రముఖ జాతీయ పత్రిక 'మింట్' లో రాసిన కథనంలో.. ప్రజలే కేంద్రంగా సాగుతున్న ఏపీ ప్రభుత్వ పాలనా విధానాన్ని, ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరును ప్రత్యేకంగా ఉదహరిస్తూ కొనియాడటం ఆనందంగా ఉందన్నారు.
నిడదవోలు నియోజకవర్గంలో విజన్ యూనిట్ ద్వారా పర్యవేక్షణ మెరుగుపడిందని, ప్రజలకు జీవనోపాధి అవకాశాలు పెరగడంతో పాటు అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని, వ్యవసాయం, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాలు, డిజిటల్ సేవలు వంటి అన్ని రంగాలను సమగ్రంగా అనుసంధానిస్తూ, స్థానిక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ కార్యాచరణ ప్రణాళిక ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిని వేగవంతం చేస్తోందని అభిప్రాయపడుతూ మహేంద్ర దేవ్ తన వ్యాసంలో పేర్కొనడం నిడదవోలుకే గర్వకారణమని మంత్రి దుర్గేష్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ యూనిట్లు కేవలం డేటా సేకరించే కేంద్రాలు కావు అని, నియోజకవర్గ స్థాయిలో 'అభివృద్ధి మేధస్సు'ను పెంపొందించే ప్రధాన కేంద్రాలని పిఎంఓ ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ అభివర్ణించడం రాష్ట్ర ప్రభుత్వ పాలనా సంస్కరణలకు లభించిన గుర్తింపు అని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. పాలనలో వివిధ శాఖలను ఒకే తాటిపైకి తెస్తూ, ప్రజల ఆకాంక్షలకు అగ్రపీఠం వేస్తూ రూపొందించిన ఈ నియోజకవర్గ స్థాయి ఫ్రేమ్‌వర్క్.. 'వికసిత్ భారత్' సాధనలో ఒక దిక్సూచిలా నిలుస్తుందని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు.
సామాజిక-ఆర్థిక పరిస్థితులు, మౌలిక వసతుల పురోగతి, సేవల నాణ్యత, స్థానిక ఆర్థిక లావాదేవీల తీరు మరియు సంక్షేమ పథకాల అమలుపై ఈ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు నిరంతరం దృష్టి సారిస్తున్నాయని మంత్రి దుర్గేష్ వివరించారు. దీనివల్ల ప్రతి నియోజకవర్గానికి సంబంధించి వాస్తవిక ఆధారాల నిధి తయారవుతోందని తెలిపారు.
రాష్ట్రంలోని 28 జిల్లాలు, 175 నియోజకవర్గాలు, 686 మండలాల్లో అమలవుతున్న ఈ బృహత్తర ప్రణాళికలో నిడదవోలు నియోజకవర్గం జాతీయ స్థాయి గుర్తింపు పొంది అందరికీ ఆదర్శంగా నిలవడం పట్ల మంత్రి దుర్గేష్ విజన్ యూనిట్ కు చెందిన నిడదవోలు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్, యంగ్ ప్రొఫెషనల్, విజన్ బృందం, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ఈ ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా అభినందించారు.
వారి అంకితభావం, వినూత్న ఆలోచనలు, క్రమబద్ధమైన కార్యాచరణ, నిరంతర పర్యవేక్షణ వల్లే ఇది సాధ్యపడిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, శాస్త్రీయ ప్రణాళికతో, సమిష్టి కృషితో రూపొందించిన ఈ నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాల సాధనలో ఒక మైలురాయిగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాను అని పేర్కొన్నారు.
ఈ కథనం తన దృష్టికి రాగానే నియోజకవర్గ విజన్ ప్లాన్ స్పెషల్ ఆఫీసర్,డిప్యూటీ కలెక్టర్ ఎన్. మనోజ్ రెడ్డి, యంగ్ ప్రొఫెషనల్ జె. ఎస్. సుధీర్ కుమార్, స్టాఫ్ అగ్రికల్చర్ సెక్టార్ కోఆర్డినేటర్ కాటంరెడ్డి అనిల్ కుమార్,ఆక్వా & లైవ్ స్టాక్ సెక్టార్ కోఆర్డినేటర్ కారింకి దుర్గప్రసాద్, ఇండస్ట్రి సెక్టార్ కోఆర్డినేటర్ గార రాజేశ్వరి, సర్విస్ & ఆర్టీజీఎస్ సెక్టార్ కోఆర్డినేటర్ మేడికాయల ప్రజ్వల్ కుమార్, పబ్లిక్ ఇంటర్ఫేస్ & పీ4 కోఆర్డినేటర్ చోడిశెట్టి నాగ వెంకట హరి దుర్గ తదితరులను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా నిడదవోలు క్యాంపు కార్యాలయంలో అభినందించారు..




